చైత్ర ఎనిమిదో తరగతి చదువుతుంది. "మమ్మీ.. పాఠశాలకు లేటవుతుంది. త్వరగా లంచ్ బాక్స్ పెట్టు" అని గట్టిగా అరిచేది. చిన్న చిన్న విషయాలకే కోప్పడేది. ఒకరోజు పాఠశాలలో స్నేహితులను పక్కకు జరగమని అడిగింది. స్నేహితులు జరిగేలోపే వారిపైన కూడా కోప్పడేది. ఒకనాడు చైత్ర వాళ్ళ బాబాయ్ చైత్రను చూడడానికి పాఠశాల వద్దకు వెళ్లాడు. బాబాయ్ అంటే చైత్రకు చాలా ఇష్టం. ఎప్పుడూ బాబాయ్ తోనే గడిపేది. పిల్లలందరూ గ్రౌండ్ లో ఆటలాడుతున్నారు. చైత్ర ఒంటరిగా చెట్టు కింద కూర్చొని ఉంది. చెమటలు పట్టి ఉంది. చాలా కోపంగా, ఆవేశంగా ఉంది. దగ్గరికి వెళ్లి "ఏమైంది నాన్నా! ఒంటరిగా కూర్చున్నావు?" అని అడిగాడు. "వాళ్ళెవరికీ అసలు ఆట ఆడటం రాదు. నేను వారితో కలిసి ఆడను" అని చిరాకు పడుతూ చెప్పింది.
"చైత్రా! నీకు ఒక విషయం చెప్తాను వింటావా?" అని అడిగాడు. "వింటాను బాబాయ్.. చెప్పు" అని అన్నది. ఒక వారం రోజులపాటు ఇంట్లో గానీ, స్నేహితుల్లో గాని, బయట గాని ఎవరు ఏం చేసినా.. నువ్వు చిరాకు పడకుండా చిరునవ్వుతో ఉండు. వారిని ఏమీ అనకు" అని చెప్పాడు. "అలాగే బాబాయ్" అన్నది చైత్ర. అలా ఉండడానికి మొదటి రెండు రోజులు చైత్రకు చాలా కష్టం అనిపించింది. ఆ తర్వాత రోజు నుండి కోపం వచ్చినా మమ్మీపై అరవలేదు. స్నేహితులు ఏం చేసినా కూడా ఓపికగా ఉండి చిరునవ్వు నవ్వేది. వారం రోజుల తర్వాత బాబాయ్ మళ్ళీ పాఠశాల వద్దకు వచ్చాడు. చైత్ర అందరితో కలిసి హాయిగా నవ్వుతూ ఆటలు ఆడుకుంటుంది.
బాబాయ్ ని చూసిన చైత్ర సంతోషంగా పరుగెత్తుకొచ్చి హత్తుకొని "థాంక్యూ బాబాయ్" అని అన్నది. చైత్ర వెనకాలే తన స్నేహితులు కూడా వచ్చారు. అందరికీ మిఠాయిలు పంచి, "పుట్టినరోజు శుభాకాంక్షలు చైత్ర" అని చెప్పాడు. "థాంక్యూ బాబాయ్" అన్నది చైత్ర. తనలో వచ్చిన మార్పును చూసి అక్కడి నుండి చిరునవ్వుతో బయలుదేరాడు.
- ముక్కామల జానకీరామ్
63063 93291







కామెంట్‌లు (0)