శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెన్ను దొంగ ఎవరు?

13 గంటల క్రితం

పెన్ను దొంగ ఎవరు? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 04:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

‘అమ్మా! నా పెన్ను కనిపించడం లేదు!’ అంటూ గదంతా కంగారుగా వెతకడం మొదలుపెట్టాడు తరుణ్. ‘బల్ల మీదే పెట్టావు కదా!’ అంది అమ్మ కిచెన్‌లోంచి వస్తూ. ‘అవును, వ్యాసం వ్రాస్తూ.. క్యాప్ తీసి పుస్తకం పక్కనే పెట్టి నీళ్లు తాగడానికి వెళ్లాను. వచ్చి చూసేసరికి లేదు!’ ఆ పెన్ను నాకు తాతయ్య బహుమతిగా ఇచ్చారు. దానితోనే నేను రేపు జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలో రాద్దామనుకున్నాను’ అని దిగులుగా ముఖం పెట్టాడు. అదే గదిలో పుస్తకం చదువుకుంటున్న అతని అక్క మేఘన నవ్వింది. ‘నువ్వే తీసి ఉంటావు అక్కా!’ గట్టిగా అన్నాడు తరుణ్. ‘నీ వస్తువులు నువ్వే ఎక్కడో పడేసి, నా మీద పడతావేంటి?’ అంది మేఘన కోపంగా. ‘సరే, మీరిద్దరూ గొడవ పడకండి. తరుణ్ నీళ్లు తాగడానికి వెళ్లినప్పుడు గదిలో ఎవరున్నారు?’ అని అమ్మ అడిగింది. ‘నువ్వు వంటగదిలోకి వెళ్లిన తర్వాత నేను ఈ గదిలోనే ఉన్నాను. కానీ నేను బల్ల దగ్గరికి వెళ్లలేదు’ అంది మేఘన.

అమ్మ నిశ్శబ్దంగా బల్ల దగ్గరకు వెళ్లి పరిశీలించింది. పుస్తకం పక్కన ఒక చిన్న గుండ్రని నీలిరంగు సిరా మరక ఉంది. బల్ల కింద తరుణ్ రాసిన వ్యాసం మొదటి పేజీ మడతపడి ఉంది. దాని చివర కూడా సిరా చుక్క ఉంది. ‘ఈ మరక నీ పెన్నుదేనా తరుణ్?’ అమ్మ అడిగింది. ‘అవును అమ్మ! నా పెన్ను రీఫిల్ కొద్దిగా లీక్ అవుతుంది.. అందుకే ఆ మరక!’ అన్నాడు. అమ్మ ఏమీ మాట్లాడకుండా గదిలోని కిటికీ వైపు చూసింది. బయట గాలి వేగంగా వీస్తోంది. కిటికీ తెరలు ఊగుతున్నాయి. అమ్మ కుర్చీని వెనక్కి లాగి, కిటికీ దగ్గరకు వెళ్లింది. ‘ఏం చేస్తున్నావు అమ్మా?’ అడిగింది మేఘన కుతూహలంగా. అమ్మ కిటికీ తెరను పక్కకు జరిపింది. తెర మడతలో ఏదో ఇరుక్కుని ఉంది. అమ్మ జాగ్రత్తగా దాన్ని బయటకు తీసింది. అది తరుణ్ పెన్నే! ‘అరే! పెన్ను ఇక్కడికి ఎలా వచ్చింది? మరి దొంగ ఎవరు?’ ఆశ్చర్యపోయాడు తరుణ్. అమ్మ చిరునవ్వు నవ్వింది.

‘ఇక్కడ దొంగ ఎవరూ లేరు తరుణ్! నువ్వు పెన్ను క్యాప్ తీసి బల్ల మీద పెట్టి వెళ్లావు. ఆ సమయంలో కిటికీలోంచి గట్టిగా గాలి వీచింది. బల్ల మీద ఉన్న కాగితం గాలికి ఎగిరి పడుతూ, పెన్నును తోసింది. ఆ తోపుడుకి పెన్ను దొర్లుకుంటూ వెళ్లి కిటికీ తెర మడతలో పడిపోయింది’ అంతే. ‘అంటే నా పెన్ను ఎవరూ దొంగిలించలేదన్నమాట! సారీ అక్కా’ అన్నాడు తరుణ్ పశ్చాత్తాపంతో. ‘పరవాలేదులే! కానీ ఏదైనా కనిపించకపోతే, ముందుగా ఎదుటివారిని అనుమానించకూడదు. పరిశీలనగా చూస్తే ఆధారాలే నిజం చెప్తాయి!’ అంది అమ్మ. ‘ఈ మిస్టరీని ఛేదించిన మన ‘డిటెక్టివ్ అమ్మ’కి బహుమతి ఏమిటి?’ మేఘన నవ్వుతూ అడిగింది. ‘నేను పోటీలో గెలిస్తే వచ్చే బహుమతి అమ్మదే!’ అన్నాడు తరుణ్ ఉత్సాహంగా. ‘నాకు బహుమతులు వద్దు.. నువ్వు గెలిచినా, ఓడినా పర్వాలేదు. ప్రయత్నించడం మాత్రం ఎప్పుడూ ఆపకూడదని గుర్తుంచుకో’ అంది అమ్మ ఆప్యాయంగా.

- కె.వి.సుమలత,

ఎన్.టి.ఆర్. కాలనీ, గుడివాడ, కృష్ణా జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్