శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసంపద సృష్టి..

18 గంటల క్రితం

సంపద సృష్టి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 04:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

కొండవీడు రాజ్యాన్ని నరసనాయుడు పాలిస్తున్న రోజులవి. చిన్న రాజ్యం అవటం వలన ఆర్ధిక వనరులు ప్రతిసారి సమీకరించుకోవలసి వచ్చేది. అందులో భాగంగా రాజ్యంలో యువతను చైతన్య పరచాలని రాజు ఒక ప్రకటన చేశాడు. ‘మహారాజుకు ఆర్ధిక సలహా దారులుగా పనిచేసే ఔత్సాహిక నిపుణులు కావలెను. ఇష్టం ఉన్న యువత రేపు ఉదయం రాజు గారి భవనం దగ్గరకు రావాలి’ అని ప్రకటన జారీచేశారు. ఆ ప్రకటన చూసి రాఘవ, సోమయ్య అనే ఇద్దరు యువకులు రాజ సభకు వచ్చారు. రాజు వారిద్దరికీ చెరో వంద బంగారు నాణాలు ఇచ్చి, ఒక ఏడాది తరువాత కనపడమన్నాడు. సంవత్సరం పూర్తయ్యాక ఇద్దరూ తిరిగి వచ్చారు. ముందుగా రాఘవ ‘అయ్యా! మీరిచ్చిన డబ్బులు కష్టాల్లో ఉన్న మా బంధువులకు సహాయంగా ఇచ్చాను. కాబట్టి ఆ డబ్బుతో నేనేమీ చేయలేదు’ అని చెప్పాడు. అప్పుడు సోమమయ్య ‘మహారాజా! మీరిచ్చిన డబ్బుతో నేను, నా మిత్రులు కలిసి ఉమ్మడి వ్యాపారం ఆరంభించాం. రైతులకు నాణ్యమైన విత్తనాలను, సేంద్రియ ఎరువులను అందించి పరిమిత లాభాలు వచ్చేలా వ్యాపారం చేస్తున్నాం. మాకు ఊర్లో మంచి ఆదరణ లభించింది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు’ అని తెలిపాడు.

అప్పుడు రాజు గూఢ చారులను పిలిపించి ‘రాఘవ, సోమయ్యలు చెప్పేది‘నిజమా, కాదా?’ అని అడిగాడు. ‘రాఘవ చెప్పింది పచ్చి అబద్ధం. అతని బంధువులకు రాఘవ ఏ సహాయం చేయలేదు. మీరిచ్చిన డబ్బుతో జల్సా చేసి, కాలం గడిపేశాడు’ అని చెప్పారు. సోమయ్య గురించి చెబుతూ ‘అతను చెప్పింది మాత్రం నిజం. సోమయ్య, అతని స్నేహితులు న్యాయబద్దమైన వ్యాపారం చేసి ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నారు’ అని చెప్పారు. ‘ఆర్ధిక క్రమశిక్షణనే దేశ పురోగతికి ప్రథమ సోపానం. డబ్బు మదుపు చేసి, సంపద సృష్టి చేసే వాడికి నిజాయితీ అవసరం. సోమయ్యకు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతన్ని నా దగ్గర సంపద సృష్టి సలహాదారుగా నియమిస్తున్నాను’ అని రాజు సభలో ప్రకటించాడు. ‘రాఘవను బందీ చేసి, అతని సోమరితనం పోయేవరకూ రాజభవనం పనులు చేయించమ’ని ఆజ్ఞాపించాడు. రాజు తీర్పుకు అంతా హర్షం ప్రకటించారు.

​- డా కొప్పరపు నారాయణ మూర్తి,

76719 09759.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్