ఒక చిన్న గ్రామంలో ఒక మంచి నీటి బావి ఉండేది. ఆ బావిలోని నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండేది. గ్రామంలోని ప్రజలందరూ ఆ నీటినే తాగడానికి, వంటకు ఉపయోగించేవారు. ఒకరోజు కొందరు పిల్లలు బావి దగ్గరకు వచ్చారు. తిన్న చిరుతిండి పొట్లాలను అక్కడే పడేశారు. మరికొందరు బావిలోకి ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారం విసిరారు. రోజులు గడిచాయి. చెత్త పెరిగిపోయింది. బావి నీరు మురికిగా మారింది. దుర్వాసన రావడం మొదలైంది. చివరకు ఆ మంచి నీటి బావి ‘కంపు నుయ్యి’గా మారిపోయింది. ఎవరూ ఆ నీటిని ఉపయోగించలేకపోయారు. అదే గ్రామంలోని విజయ్ అనే అబ్బాయి ప్రతిరోజూ చిప్స్, చాక్లెట్స్, కేకులు, నూడిల్స్, కూల్‌డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాడు. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని సరిగా తినేవాడు కాదు.
కొంతకాలానికి విజయ్‌కు తరచూ కడుపునొప్పి వచ్చేది. ఆరోగ్యం కూడా దెబ్బతింది. డాక్టర్ విజయ్‌ను పరీక్షించి ‘ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి’ అని చెప్పారు. సమస్య ఎక్కువ కావడంతో విజయ్‌కు ఆసుపత్రిలో చికిత్స అవసరమైంది. కొంతకాలం ఆసుపత్రిలో ఉండి, డాక్టర్ సూచనలు పాటించిన తర్వాత విజయ్ కోలుకున్నాడు. అప్పుడు విజయ్ బావిని గుర్తు చేసుకున్నాడు. ‘బావిలో చెత్త వేస్తే మంచి నీరు కూడా పనికిరాకుండా పోయింది. అలాగే మన కడుపులోకి అనారోగ్యకరమైన ఆహారాన్ని పదేపదే వేస్తే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది’ అని అర్థం చేసుకున్నాడు.
అప్పటి నుంచి జంక్ ఫుడ్‌ను తగ్గించి, ఇంటి ఆహారం, పాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాడు. తన స్నేహితులకు కూడా జంక్ ఫుడ్స్ వలన కలిగే అనర్థాలు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు గురించి వివరించాడు. విజయ్ పూర్తిగా కోలుకున్న తరువాత తన స్నేహితులు, గ్రామంలోని పెద్దలతో కలిసి బావిని శుభ్రం చేశాడు. ఇకపై బావిలో చెత్త వేయకూడదని గ్రామస్తులందరూ నిర్ణయించుకున్నారు.
- జయరామ్ నాయుడు








కామెంట్‌లు (0)