చామలాపల్లి అగ్రహారంలో లచ్చవ్వ, రామవ్వ అనే స్నేహితులు ఉన్నారు. ఒకరోజు సాయంత్రం ఇంటి అరుగుమీద కూర్చుని లచ్చవ్వ, రామవ్వ కబుర్లు చెప్పుకుంటున్నారు. రుద్రాంశ్ వాళ్ల పక్కనే ఆడుకుంటున్నాడు. అప్పుడే వీధిలో వెళ్తున్న సోమయ్యను చూపిస్తూ రామవ్వ ఇలా అంది. ‘అతడు నెమ్మదస్తుడు. ఎవరినీ పల్లెత్తు మాట అనడు. చూడటానికి అమాయకుడిలా ఉంటాడు. నిన్న వ్యాపార నిమిత్తం పొరుగూరికి వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా, మామిడి తోపు దగ్గర ఒక దొంగ కత్తి చూపించి ‘డబ్బులన్నీ ఇవ్వు’ అంటూ బెదిరించాడు. అప్పుడు సోమయ్య ఏమాత్రం భయపడలేదు. నిదానంగా వెనక్కి జరుగుతూ దొంగ కదలికలను గమనించాడు. అది చూసి దొంగ ఒక్కసారిగా సోమయ్య మీదకు దూసుకొచ్చాడు. అప్పుడు సోమయ్య చాకచక్యంగా పక్కకు తప్పుకుని, వాడిని గట్టిగా నెట్టాడు. దాంతో దొంగ అదుపుతప్పి కిందపడ్డాడు. దొంగ చేతిలోని కత్తి కూడా కిందపడిపోయింది. ఆత్మరక్షణ కోసం క్షణం ఆలస్యం చేయకుండా సోమయ్య కిందపడిన కత్తిని తీసుకుని ధైర్యంగా నిలబడ్డాడు. ఊహించని ప్రతిఘటనకు దొంగ భయపడ్డాడు. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది. దాంతో అక్కడి నుంచి దొంగ పరుగులు తీశాడు. ఇదంతా చెట్టు చాటున నక్కి ఉన్న ఓ గ్రామస్తుడు చూసి నాతో చెప్పాడు.’ ‘సోమయ్య అమాయకుడిలా కనిపించినా, అవసరమైనప్పుడు పులిలా విజృంభించాడు’ అంది. ‘అయితే సోమయ్య మెత్తని పులన్నమాట!’ అంది లచ్చవ్వ.
వీళ్ల సంభాషణ అంతా వింటున్న రుద్రాంశ్ ‘అవ్వా! బెంగాల్ పులి, చిరుతపులి ఉన్నాయి కానీ ఈ మెత్తని పులి ఎక్కడి నుంచి వచ్చింది?’ అని అడిగాడు. లచ్చవ్వ నవ్వుతూ ‘మెత్తని పులి’ అనేది ఒక జాతీయం. సాధారణంగా సౌమ్యంగా కనిపించే కొందరు అవసరమైనప్పుడు మాత్రం శత్రువుల పాలిట పులిలా విజృంభించి ధైర్యంగా పోరాడతారు. అలాంటి వ్యక్తులను ఉద్దేశించి ఇలా అంటారు’ అని వివరించింది. ‘అంటే... బయటికి మెత్తగా, అమాయకంగా కనిపించినా, అవసరమైనప్పుడు పులిలా ధైర్యంగా నిలబడాలన్నమాట’ అన్నాడు రుద్రాంశ్. ‘శభాష్! రుద్రా!’ అని తల నిమిరింది లచ్చవ్వ.
- కాశీవిశ్వనాథం పట్రాయుడు,
ఆంగ్ల ఉపాధ్యాయుడు,
శృంగవరపుకోట,
94945 24445.






కామెంట్‌లు (0)