ప్రవళిక చాలా చురుకైన, తెలివైన అమ్మాయి. మాదారం పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నది. ఒకరోజు ఆ పాఠశాలకు సేఫ్టీ, సెక్యూరిటీలో భాగంగా ‘డ్రగ్స్ ప్రభావం-నివారణ’ అనే అంశంపై అవగాహన కల్పించడానికి పోలీసులు వచ్చారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులందరినీ ఒకచోట సమావేశపరిచారు. ఎస్సైతో పాటు మిగిలిన కానిస్టేబుల్స్ మాటలు, పాటల ద్వారా అవగాహన కల్పించారు. సాయంత్రం బడి వదిలిన తర్వాత ప్రవళిక ఇంటికి వెళ్లింది. తాను విన్న విషయాన్ని మరింత లోతుగా ఇంటి దగ్గర ఉన్న తాతయ్యను అడగాలని అనుకుంది.
ఇంటికి వెళ్లగానే.. ‘హాయ్..! తాతయ్య! ఇవాళ మా పాఠశాలలో ఏం జరిగిందో తెలుసా? మా బడికి ఈరోజు పోలీసులు వచ్చారు తాతయ్య. డ్రగ్స్ అంశంపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాళ్లు చాలా విషయాలు చెప్పారు. డ్రగ్స్ అంటే మత్తు పదార్థం అంట. అది సేవిస్తే మన శరీరానికి నష్టం జరుగుతుంది అన్నారు. నాకు కొద్ది కొద్దిగా అర్థమైంది తాతయ్య. నీకు తెలిస్తే మరిన్ని విషయాలు చెప్పవా?’ అని అడిగింది ప్రవళిక.
‘ఈ మధ్య టీవీలలో, పత్రికలలో చెడు వ్యసనాలపై చాలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువతనే కాదు పిల్లలను కూడా ఆగం చేస్తున్నాయి. ఆరోగ్యం చెడిపోతుంది. ఎప్పుడైనా ఆ అలవాట్లకు అందరం దూరంగా ఉండాలి’ అని తాతయ్య చెప్పాడు. ‘సరే తాతయ్య. ఇంకా మరిన్ని విషయాలు చెప్పవా?’ అని ఆత్రుతగా అడిగింది.
‘డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు. అవి గంజాయి, కొకైన్, హెరాయిన్ మొదలగు పేర్లతో పిలుస్తారు. అవి టాబ్లెట్స్ రూపంలో, ఇంజక్షన్ రూపంలో, చాక్లెట్స్ రూపంలో అమ్ముతారు. వాటిని సేవిస్తే శరీరంలోని మెదడు, ఇతర అవయవాలు చెడిపోతాయి. డ్రగ్స్‌కు అలవాటు పడితే చదువులో రాణించలేం. మన ప్రవర్తన పిచ్చిపిచ్చిగా ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులు చాక్లెట్స్ ఇస్తే తీసుకోకూడదు. కాబట్టి వాటికి మనం దూరంగా ఉండాలి’ అని తాతయ్య విడమర్చి చెప్పాడు.
మరుసటి రోజు స్కూలుకు వెళ్లిన ప్రవళిక తరగతిలోని టీచర్‌తో ‘టీచర్.. నిన్న ఇంటికి వెళ్లి మా తాతగారిని డ్రగ్స్ గురించి మరిన్ని వివరాలు అడిగాను. తాతయ్య చాలా విషయాలు చెప్పారు. ఎప్పుడైనా చెడు వ్యసనాలు కలిగించే డ్రగ్స్ పదార్థాలు ఎవరైనా అమ్మినప్పుడు పోలీసులు ఇచ్చిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తాను. అలాగే మన బడిలో ఎప్పుడైనా మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను కూడా చెడు వ్యసనాలపై మాట్లాడతాను’ అని చెప్పింది. ‘సరే అలాగే చేద్దువుగాని’ అంటూ ప్రవళిక తీసుకున్న నిర్ణయానికి టీచర్ అందరి విద్యార్థులతో గట్టిగా చప్పట్లు కొట్టించారు.
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
94415 61655.







కామెంట్‌లు (0)