- పౌరుల స్వేచ్ఛ హరిస్తే పోలీసులపై చర్యలు
- స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ : పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ అకారణంగా అరెస్టు చేస్తే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయకుండా ఒక వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా అందించకపోతే, ఆ అరెస్టు చట్టవిరుద్ధమేనని జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అసలేంటి కేసు..
శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) పార్టీ ములన్‌పూర్ దాఖా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జస్కరణ్‌జీత్ సింగ్ అరెస్టును ధర్మాసనం చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఒక మైనర్‌పై లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణల కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టు కారణాలను ఆయనకు అందజేయలేదన్న కారణంతో స్థానిక కోర్టు ఆ అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించి, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే పంజాబ్-హరియాణా హైకోర్టు ఆ ఉత్తర్వుపై స్టే విధించడంతో సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పును వెలువరిస్తూ జస్టిస్ భుయాన్, ఆర్టికల్ 22లోని (1), (2) క్లాజులు రెండింటినీ ఉల్లంఘించి అరెస్టయిన నిందితుడిని మళ్లీ అరెస్టు చేయవచ్చా, చేయవచ్చంటే ఏ పరిస్థితుల్లో, ఏ పద్ధతిలో, ఏ విధానం పాటించాలి అనేది ఈ అప్పీలు లేవనెత్తిన విస్తృత రాజ్యాంగ ప్రాధాన్యం గల ప్రశ్న అని పేర్కొన్నారు. గతంలో వచ్చిన శ్రీ దర్శన్, సోనమ్ రఘువంశీ కేసుల తీర్పులు భిన్నంగా కనిపించినా, వాటిపై చర్చ అనవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. శ్రీ దర్శన్ తీర్పు మిహిర్ రాజేష్ షా వర్సెస్ మహారాష్ట్ర (2025) కేసు కన్నా ముందు వెలువడిందని, సోనమ్ రఘువంశీ కేసులో అరెస్టు కూడా మిహిర్ రాజేష్ షా తీర్పుకు ముందే జరిగిందని గుర్తుచేసింది. అందువల్ల సరైన చట్టాన్ని నిర్దేశించేది, అందరికీ కట్టుబడి ఉండేది మిహిర్ రాజేష్ షా తీర్పేనని స్పష్టం చేసింది.
అర్థమయ్యే భాషలోనే ఉండాలి..
అరెస్టు కారణాలు లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలో ఉండాలి. దాని ప్రతిని ఎలాంటి మినహాయింపు లేకుండా, వీలైనంత త్వరగా అరెస్టయిన వ్యక్తికి అందజేయాలి. ఇది నిందితుడి ప్రాథమిక హక్కు, చట్టబద్ధమైన హక్కు కూడా. ఈ హక్కును హరించే ప్రయత్నాలను కోర్టులు కఠినంగా పరిగణించాలి. ఇది అరెస్టు, రిమాండ్ ప్రక్రియను చెల్లనిదిగా చేస్తుంది. తర్వాత ఛార్జిషీటు దాఖలు చేసినా అలాంటి అరెస్టు చెల్లుబాటు కాదు. ఆర్టికల్ 22 ఐపిసితో పాటు ప్రత్యేక చట్టాల కింద నమోదైన నేరాలన్నింటికీ వర్తిస్తుంది. ఇది కేవలం లాంఛనం కాదు, తప్పనిసరిగా పాటించాల్సిన రాజ్యాంగ రక్షణ. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు నిందితుడికి నష్టం జరిగిందా అన్న ప్రశ్న తలెత్తదు. ఈ హక్కు అత్యంత పవిత్రమైనదని, ఏ పరిస్థితుల్లోనూ దాన్ని ఉల్లంఘించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉల్లంఘన జరిగితే అరెస్టయిన వ్యక్తిని వెంటనే విడుదల చేయాల్సిందేనని పేర్కొంది. ఆర్టికల్ 22(1) రక్షణలు కేవలం విధానపరమైన అంశాలు కావని, వ్యక్తి స్వేచ్ఛను హరించే ప్రతి సందర్భంలో పాటించాల్సిన మౌలిక సూత్రాలని తెలిపింది.
అక్రమాలకు తావుండకూడదు...
విడుదల తర్వాత దర్యాప్తు కోసం కస్టడీలో విచారణ అవసరమని దర్యాప్తు సంస్థ భావిస్తే, తిరిగి అరెస్టుకు కారణాలు, అవసరాన్ని పేర్కొంటూ సంబంధిత మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేయాలి. తొలుత అరెస్టు కారణాలను ఎందుకు అందజేయలేదో ఆ దరఖాస్తులో వివరణ ఉండాలి. అయితే నిందితుడికి ముందుగా అరెస్టు కారణాలను అందజేసిన తర్వాతే ఈ దరఖాస్తు చేయాలి. కుమ్మక్కు, అక్రమాలకు తావు లేకుండా ఆ దరఖాస్తుపై తక్షణ పై అధికారి ఆమోదం ఉండాలి. సంబంధిత అధికారి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని పై అధికారికి తెలియాలన్నదే దీని ఉద్దేశం. దరఖాస్తు అందిన తర్వాత మేజిస్ట్రేట్ సహజ న్యాయ సూత్రాలను పాటిస్తూ, మిహిర్ రాజేష్ షా కేసులో సూచించినట్లు వీలైతే వారం రోజుల్లోగా త్వరగా నిర్ణయం తీసుకోవాలి. తొలుత కారణాలు అందజేయలేకపోవడానికి సద్భావనతో కూడిన కారణాలు ఉన్నాయని, తర్వాత విడుదల అనంతరం అందజేశారని మేజిస్ట్రేట్ సంతృప్తి చెందితే, పైగా నిందితుడిని మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తే, ఆ మేరకు అనుమతి ఇవ్వవచ్చు. పరిపాలనా పరంగా, ఇలాంటి దరఖాస్తు వచ్చినప్పుడు పై అధికారి కేసు దర్యాప్తును మరో అధికారికి అప్పగించాలి. అంతటి తీవ్రమైన లోపానికి సంబంధించి శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించాలి. విచారణలో ప్రతికూల అంశాలు తేలితే, సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన సర్వీసు రికార్డులో నమోదు చేయాలి. రాజ్యాంగ ఉల్లంఘనను నిర్ద్వంద్వంగా అడ్డుకోవాలని, ఉల్లంఘన జరిగాక మళ్లీ అరెస్టు చేసే అధికారాన్ని అదే ఉల్లంఘనకు పాల్పడిన అధికారి విచక్షణకు వదిలేయకూడదని, అది న్యాయపరమైన నియంత్రణలో జరగాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ప్రతిని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల డిజిపిలకు పంపింది.







కామెంట్‌లు (0)