- ఐద్వా నేతృత్వంలో వేలాది మంది మహిళల ఆందోళన
- స్పందించని మహారాష్ట్ర ప్రభుత్వం
ముంబయి : ‘లాడ్లీ బెహనా’ పథకంను పునరుద్ధరించాలని కోరుతూ మహారాష్ర్టలో వేలాది మహిళలు రోడ్డేక్కారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా) ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనను నిర్వహించారు. థానే-పాలగడ్ జిల్లాలోని దహనులో ఈ ఆందోళన జరిగింది. దహను తాలూకాకు చెందిన వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళలు ఏం కోరుతున్నారంటే..
2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే ఆ ఏడాది ఆగస్టులో మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం ‘లాడ్లీ బెహనా’ పథకాన్ని ప్రారంభించింది. ప్రారంభంలో 2.63 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అయితే ఎన్నికల తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చిన బిజెపి ఈ పథకాన్ని వెంటనే నీరు గార్చింది. డిసెంబరు నెల నుంచి సహయాన్ని నిలిపివేసింది. పైగా ‘పరిశీలన ప్రక్రియ’ పేరుతో దాదాపు కోటి మంది మహిళలను ఈ పథకం నుండి తొలగించారు. దీంతో వీరి కోసం ఐద్వా మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ నెల 20 దహనులో జరిగిన భారీ సభతో ఈ ఉద్యమం మొదలైంది. సెప్టెంబర్ 27 వరకు థానే-పాలఘర్ జిల్లా అంతటా ఇలాంటి సభలు నిర్వహించనున్నారు, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. దహనులో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షురాలు మరియం ధావలే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి- జాతీయ సంయుక్త కార్యదర్శి ప్రాచి హతివ్లేకర్ తదితర నాయకులు ప్రసంగించారు. మహారాష్ట్రవ్యాప్తంగా పథకం నుండి తొలగించిన వేలాది మంది మహిళలను ఏకం చేసి, రాజధాని ముంబయిలోని ‘మంత్రాలయ’ (రాష్ట్ర సచివాలయం) వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించనున్నట్లు ఐద్వా నాయుకులు ప్రకటించారు. ఈ ప్రకటనతో దహను ఆందోళనలలో పాల్గొన్న మహిళల నుండి భారీ స్పందన లభించింది.







కామెంట్‌లు (0)