ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతెలివైన పావురం

2 గంటల క్రితం

Pigeon Pleads Before the King.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 07:23 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

చంద్రగిరి రాజ్యాన్ని సూర్యసేనుడు అనే రాజు పాలించేవాడు. ప్రజల సుఖసంతోషాలే తన పాలనకు కొలమానమని భావించేవాడు. అందుకే రాత్రివేళల్లో మారువేషం ధరించి, కాలినడకన రాజ్యమంతా తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు.

అలా ప్రజల కోసం తిరుగుతుండగా, కొంతకాలానికి రాజుగారి మోకాళ్లలో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఆస్థాన వైద్యులు ఎన్నో రకాల మందులు, చికిత్సలు చేసినా నొప్పి పూర్తిగా తగ్గలేదు.

రాజు బాధను చూసిన మంత్రి "మహారాజు మోకాళ్ల నొప్పిని పూర్తిగా నయం చేసిన వారికి తగిన బహుమతి అందజేయబడుతుంది” అని ఒక ప్రకటన చేయించాడు.

ఈ ప్రకటనతో రాజ్యంలోని వైద్యులంతా రాజును పరీక్షించి, తమకు తెలిసిన రకరకాల వైద్యాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది.

ఒకరోజు ఆస్థానంలోకి ఒక ఆదివాసి వైద్యుడు వచ్చాడు. రాజు మోకాళ్లను నిశితంగా పరిశీలించి,"మహారాజా! అడవిలో దొరికే కొన్ని అరుదైన వన మూలికలతో ఈ నొప్పిని నయం చేయవచ్చు” అన్నాడు.

“ఆ మూలికలు ఎక్కడ దొరుకుతాయి?” అడిగాడు రాజు.

"మామూలు అడవిలో ఇవి దొరికే అవకాశం తక్కువ శేషాచలం కొండలలో దట్టమైన కీకారణ్యం లోకి వెళ్లి వెదికి తేవాలి. అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ తెచ్చిన వాటిని గుర్తించి, సరైన పద్ధతిలో ఉపయోగించాలి” అని చెప్పాడు.

"మరి దీనికి వేరే మార్గం ఏమైనా ఉందా!" అని అడిగాడు మంత్రి.

"ఇంకొక వైద్యం ఉంది అడవి పావురం పచ్చి రక్తాన్ని మోకాళ్లకు పూస్తే నొప్పి తగ్గుతుందని మా పెద్దలు చెబుతుండేవారు. ఆ విధంగా వారానికి ఒకసారి, ఆరు నెలల పాటు చేస్తే ఫలితం ఉంటుందట”అని చెప్పాడు ఆ వైద్యుడు.

మంత్రి వెంటనే రాజ భటులను పంపించాడు. అడవిలో ఒక పావురాన్ని పట్టుకొచ్చారు. ఆ ఆడ పావురాన్ని చూసి రాజు గుండె కలిచి వేసింది.

అప్పుడే పావురం చేతులు జోడించినట్టు రెక్కలు ముడుచుకుని,"రాజా! నమస్కారం. నేను నా పిల్లలకు ఆహారం వెతుక్కుంటూ ఉండగా మీ భటులు నన్ను పట్టుకొచ్చారు. నన్ను చంపితే నా పిల్లలు అనాథలవుతారు. మీతో ఒక మాట చెప్పే అవకాశం ఇవ్వండి” అని వేడుకుంది.

రాజు ఆశ్చర్యంగా దానివైపు చూసి, “చెప్పు ఏమిటా మాట?” అని అడిగాడు.

"నా ప్రాణాన్ని తీస్తే మీ నొప్పి తగ్గుతుందో లేదో నాకు తెలియదు. కానీ నన్ను నమ్మి ఒక అవకాశం ఇస్తే, మీ మోకాళ్ల నొప్పిని తగ్గించే వనమూలికలను అడవి నుంచి నేను తెచ్చి ఇస్తాను” అని చెప్పింది.

మంత్రి నవ్వుతూ, “మహారాజా! పక్షి మాటలు నమ్మి మీ వైద్యాన్ని ఆపడం మంచిది కాదు” అన్నాడు.

పావురం వెంటనే, “రాజా! నా రక్తం మీ మోకాళ్ళకు పూసినా నొప్పి తగ్గక పోతే నా ప్రాణం పోయినట్టే. కానీ నా మాట నమ్మి నాకు అవకాశం ఇస్తే, మీకు మేలు జరిగే అవకాశం ఉంది. నా మీద దయ పెట్టండి” అని ప్రార్థించింది.

రాజు కాసేపు ఆలోచించాడు.

“సరే! నీకు ఒక అవకాశం ఇస్తాను కానీ నువ్వు తిరిగి రాకపోతే?”

"లోక కళ్యాణాన్ని కోరుకునే రాజును మోసం చేయడం నా ధర్మం కాదు మహారాజా! నేను తప్పకుండా తిరిగి వస్తాను నన్ను నమ్మండి” అంది. రాజు అంగీకరించాడు. పావురం అడవికి ఎగిరిపోయింది. ముందుగా తన పిల్లలకు ఆహారం పెట్టింది. ఆ తర్వాత శేషాచలం అడవిలోని కొండచరియల మధ్య, చెట్ల నీడల్లో పెరిగే వన మూలికలను వెతకడం ప్రారంభించింది. తనకు తెలిసిన ప్రతి మూలికను జాగ్రత్తగా సేకరించి రాజభవనానికి తీసుకొచ్చింది.

ఆ మూలికలను చూసిన ఆస్థాన వైద్యులు ఆశ్చర్యపోయారు.

"ఇవన్నీ చాలా అరుదైన ఔషధ మొక్కలు!” అన్నారు. వైద్యులు వాటితో రాజుకు చికిత్స ప్రారంభించారు. కొన్ని రోజులకు రాజు మోకాళ్ల నొప్పి తగ్గడం మొదలైంది. నెలలు గడిచాయి. ఒకరోజు రాజు ఎలాంటి ఆసరా లేకుండా లేచి నడిచాడు.

“నా నొప్పి పూర్తిగా తగ్గిపోయింది!” అని ఆనందంగా అన్నాడు.

రాజు వెంటనే పావురాన్ని పిలిపించాడు.

“నీ తెలివితేటలు నీ ప్రాణాన్ని మాత్రమే కాదు, నా ఆరోగ్యాన్ని కూడా కాపాడాయి. నీకు_ బహుమతిగా ఏమి కావాలో కోరుకో!” అని అడిగాడు.

పావురం వినయంగా, “మహారాజా! నాకు బహుమతి అవసరం లేదు. ఇకపై ఏ జీవిని చంపనని మాటివ్వండి. ఎందుకంటే చంపే ముందు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ప్రాణికీ తన కుటుంబం ఉంటుంది. అదే నాకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి” అంది.

ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి.

“ఈ రోజు నుంచి నా రాజ్యంలో అవసరం లేని ప్రాణహింస జరగకూడదు. ప్రకృతి లోని ప్రతి జీవిని సంతోషంగా బతకాలి” అని రాజాజ్ఞ జారీ చేశాడు.

ఆ రోజు నుంచి పావురం తెలివి తేటలతో చంద్రగిరి రాజ్యంలో మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా భయంలేకుండా జీవించసాగాయి.

పేరూరు బాలసుబ్రమణ్యం

_ _ _98492 24162_

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్