శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్క వెంటే మనం

2 గంటల క్రితం

story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మిహిర చదివేది ఏడో తరగతి. తమ్ముళ్లు ముగ్గురు. హితార్థ్ ఆరు, ధృవ ఐదు, ఉధీర్ణ్ నాలుగు చదువుతున్నారు. ప్రతిరోజు నలుగురు కలిసి పాఠశాలకు వెళ్లేవారు. మిహిర పెద్ద కావటంతో ముగ్గురిని జాగ్రత్తగా తీసుకువెళ్లేది. మిహిరతో పాఠశాలకు వెళ్లటం వారికి నచ్చేది కాదు. కారణం వారిని రోడ్డు పక్కగా నడవమనటం, పరుగెత్తకుండా చూడటం, వాహనాలను గమనించమనటం, రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు చెప్పటం వారికి నచ్చేది కాదు. మధ్య మధ్యలో అక్కతో వాదనకు దిగేవారు. ‘మాకు అన్నీ తెలుసు. నువ్వు రోజూ చెప్పొద్దు. వినలేకపోతున్నాం’ అనేవారు. మిహిర వారి మాటలకు నవ్వుకునేది. అయినా మళ్లీ అలాగే చెబుతూ తమ్ముళ్లను స్కూలుకు తీసుకెళ్లేది.


ఒకరోజు తల్లి మిహిరను ఇంట్లో ఉండమంది. విషయం తెలిసి హితార్థ్, ధృవ, ఉధీర్ణ్ ఎగిరి గెంతేశారు. ముగ్గురూ సంతోషంతో బ్యాగులు తీసుకుని పాఠశాలకు బయలుదేరారు. వారు దారిలో ఆటలు ఆడుతూ పరుగులు తీస్తున్నారు. ఇంతలో దూరంగా కొందరు గుమిగూడటాన్ని ముగ్గురూ గమనించారు. దగ్గరగా వెళ్లి చూశారు. ఒక కుక్కపిల్ల స్కూటీకి తగిలి కిందపడింది. పాపం, అది లేవలేకపోతోంది. ఎవరో కుక్కపిల్లను ఎత్తుకుని పరిశీలించారు. దెబ్బలు తగల్లేదు. కానీ బాగా భయపడింది. కాలు కింద పెట్టలేకపోతుంది. హితార్థ్ అమ్మ తనకిచ్చిన బిస్కట్లు కుక్కపిల్లకు పెట్టాడు. అది తిని కృతజ్ఞతగా తోక ఊపింది. కాస్త బలం రావటంతో అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ క్షణంలో ముగ్గురూ ఒక ఆలోచనకు వచ్చారు. కుక్కపిల్ల వెంట దాని తల్లి లేకపోవటం వల్లే గాయపడింది. మనం కూడా అక్క మాట వినాలి. అక్క చెప్పినట్లు నడుచుకోవాలి. అక్క వెంటే నడవాలని నిర్ణయించుకున్నారు.


- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర,

బీటెక్ మూడో సంవత్సరం (ఈసీఇ),

ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల,

ఖమ్మం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్