- మంత్రిని ప్రశ్నించిన సిపిఎం
ప్రజాశక్తి-టెక్కలి రూరల్ (శ్రీకాకుళం) : ఆప్ షోర్ రిజర్వాయర్ ఎప్పటి లోగా పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావులు ప్రశ్నించారు. సోమవారం సిపిఎం ప్రతినిధి బృందం ఆప్ షోర్ రిజర్వాయర్ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్న హామీని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఇదేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు. ఆప్ షోర్ రిజర్వాయర్ 2008లో 125 కోట్లు అంచనా వ్యయంతో ప్రారంభించినప్పటికీ నేటికి 18 ఏళ్లు కావస్తున్న 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. చాపర నుండి రేగులపాడు వరకు ఆప్ షోర్ రిజర్వాయర్ కు 17 కిలోమీటర్ల ప్లెడ్ ఫ్లో కెనాల్ పూర్తి చేయవలసి ఉండగా సగం కూడా పూర్తి చేయలేదని, పాలకులు నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్ షోర్ రిజర్వాయర్ పూర్తయితే నందిగామ టెక్కలి పలాస మెలియాపుట్టి నాలుగు మండలాల్లో 108 గ్రామాల్లో 24,600 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పలాస మున్సిపాలిటీకి త్రాగునీరు అందివ్వడం జరుగుతుందని అన్నారు. ఆప్ షోర్ రిజర్వాయర్ పూర్తయితే నందిగామ మండలంలోని 12,090 ఎకరాలు టెక్కలి మండలంలో 1820 ఎకరాలు పలాసలో 6,800 ఎకరాలు మెలియాపుట్టి మండలాల్లో 3890ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆప్ షోర్ రిజర్వాయర్ కు ఎందుకు నిధులు కేటాయించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆప్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రమైన అన్యాయానికి గురవుతుందని, నందిగామ ప్రాంతంలో అనేక గ్రామాలు పంటల పండగ వలసలు వెళ్లిపోయిన విషయం మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. రైతులు సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వంకు పట్టదా అని ప్రశ్నించారు. 450 కోట్లు కేటాయిస్తే ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తవుతుందని, తద్వారా ఈ ప్రాంత ప్రజలకి రెండు పంటలకు నీరుతో పాటు పలాస కూడా నీరివ్వచ్చని అన్నారు. ఎందుకు నిధులు కేటాయించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు . ఎన్నికలకు ముందు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు ఇస్తే జిల్లా అంతా సస్యశ్యామలమవుతుందని అన్నారు. వంశధార రిజర్వాయర్కు 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే రిజర్వాయర్ ద్వారా రెండు పంటలకు నీరు అందివ్వచ్చని అదే విధంగా వంశధార నాగావళి అనుసంధానానికి 100 కోట్లు కేటాయిస్తే పూర్తవుతుందని అన్నారు. వంశధార బ్యారేజీ నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిందని వంశధార బ్యారేజ్ శిధిలా వ్యవస్థకు చేరుకొందని ఆధునికరణ చేయకపోతే ఏ క్షణంలోనైనా కూలిపోతుందని ఆధునికరణ కోసం 1500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, పాలిని సాంబమూర్తి, బగాది వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)