చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ సుబ్బిశెట్టి కిరాణా షాపు ఒక్కటే అవ్వడం వలన ఆ షాపు ఎప్పుడూ రద్దీగా ఉండేది. అయితే సుబ్బిశెట్టి తూకం సరిగా తూయడంలేదనే అనుమానం చాలామందికి ఉండేది. కానీ రుజువు చేయడం ఎవరికీ కుదిరేది కాదు. ఒకసారి సుబ్బిశెట్టి పాలు పోసే సూరమ్మకి అర కేజీ వెన్నపూస, పావు కేజీ ఆవు నెయ్యి తెమ్మని చెప్పాడు. సుబ్బిశెట్టి అడిగినట్లుగానే వెన్నపూస, ఆవు నెయ్యి తెచ్చి ఇచ్చింది సూరమ్మ. వెన్నపూస, ఆవు నెయ్యి తూకం వేశాడు సుబ్బిశెట్టి. వెన్నపూస నాలుగు వందల గ్రాములు ఉంది, ఆవు నెయ్యి రెండు వందల గ్రాములు ఉంది. ఆ తూకం చూసిన సుబ్బిశెట్టికి కోపం వచ్చింది.
‘సూరమ్మా! నీకేమైనా బుద్ధి ఉందా? తూకం ఇలా తూస్తే నష్టం ఎవరికి? పగలు రాత్రి కష్టపడి తెచ్చిన రూపాయి మిగలడం లేదు. తూకం సరిగ్గా లేని నీ ఆవు నెయ్యి, నీ వెన్నపూస నువ్వే పట్టుకుపో! నాకేం అక్కర్లేదు’ అని గట్టిగా చెప్పాడు. సుబ్బిశెట్టి మాటలకు సూరమ్మ ఒక్క మాట మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయింది. అది చూసి సుబ్బిశెట్టి దుకాణానికి వచ్చిన వాళ్లతో.. ‘చూడండి.. తప్పు చేసింది. అందుకే మౌనంగా వెళ్లిపోయింది.’ అన్నాడు.
కొంచెం సేపటి తరువాత సూరమ్మ వచ్చింది. వస్తూ వస్తూ బెల్లం, పంచదార ఉన్న పొట్లాలను సుబ్బిశెట్టి ముందు పరిచింది. ‘ఇదేంటి? ఇవి ఎందుకు నా ముందు పెట్టావు?’ అన్నాడు వెటకారంగా సుబ్బిశెట్టి. ‘బాబూ.. ఎప్పుడు వెన్నపూస తూచినా, ఆవునెయ్యి తూచినా దానికంటే ఎక్కువే తూస్తాను గాని తక్కువ మాత్రం తూయను. నిన్న మా ఇంట్లో తూకం రాళ్లు కనపడక సాయంత్రం మీ ఇంటి నుండి వెళుతూ వెళుతూ.. మీ దుకాణంలో కొనుక్కొని వెళ్లిన అర కేజీ బెల్లంతో వెన్నపూస తూశాను, పావు కేజీ పంచదారతో ఆవునెయ్యి తూశాను’ అంది నింపాదిగా సూరమ్మ.
సరుకులు కొనడానికి వచ్చిన వాళ్లందరూ సుబ్బిశెట్టి వంక ఆశ్చర్యంగా చూశారు. సుబ్బిశెట్టి తూకం సరిగా ఉండదు అనుకునే వాళ్ల సందేహాలకు ఆ మాట నిజమేనని రుజువయ్యింది. వాళ్లందరూ తనవంక ఆశ్చర్యంగా చూస్తుంటే సుబ్బిశెట్టి సిగ్గుతో తలవంచుకున్నాడు. ‘ఇకనుండి ఎవరికీ తప్పుగా తూకం వేయను. నిజాయితీగా కిరాణా షాపు నడిపించుకుంటాను’ అని మనసులో అనుకున్నాడు.
- కనకం ఉజ్జీన, 80196 89694.








కామెంట్‌లు (0)