mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చేట భారతం

1 రోజు క్రితం

katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 12:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పేదరాశి పెద్దమ్మకున్నంత నేర్పు, ఓర్పు ఉంది లచ్చవ్వకు. ఆమె చెప్పే సామెతలు, జాతీయాల కథలంటే పిల్లలకు చెప్పలేనంత ఇష్టం. ఒక రోజు సాయంత్రం లచ్చవ్వ చుట్టూ మునిమనవలంతా చేరి కూర్చున్నారు. ‘మామ్మగారూ! ఒక కథ చెప్పండి’ అని అడిగారు. ‘కథ చెబుతాను. కానీ ముందు మీలో ఒక్కొక్కరు మీకు బాగా నచ్చిన కథను క్లుప్తంగా చెప్పాలి’ అంది లచ్చవ్వ. ‘సరే!’ అన్నారు పిల్లలు.

మొదట కాత్యాయని తనకు నచ్చిన కథను చక్కగా చెప్పింది. జున్నుబాబు కాకి కథను నాలుగు మాటల్లో ముగించేశాడు. చివరగా రుద్రాంశ్ లేచి నిలబడ్డాడు. ‘ఒక అడవిలో ఆవు, పులి ఉండేవి...’ అంటూ కథ మొదలుపెట్టాడు. ఆవు తర్వాత పులి గురించి, పులి తర్వాత జింక గురించి, జింక తర్వాత కుందేలు గురించి చెబుతూ కథను ఎక్కడికో తీసుకెళ్లాడు. నక్క, ఎలుగుబంటి, కోతి... ఇలా అడవిలోని జంతువులన్నింటినీ కథలోకి తెచ్చాడు. తన కథ ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. లచ్చవ్వ నవ్వుతూ, ‘ఒరేయ్ రుద్రా! కథ చెప్పమంటే అడవిలోని జంతువుల లెక్కలన్నీ చెబుతున్నావే! నీ కథ అంతూ పొంతూ లేకుండా చేట భారతం అయిపోయింది!’ అంది.

‘చేట భారతం అంటే ఏమిటి మామ్మగారూ?’ అని అడిగాడు జున్నుబాబు. ‘చేట భారతం ఒక జాతీయం బాబూ. నాలుగు మాటల్లో చెప్పాల్సిన విషయాన్ని అనవసరంగా సాగదీసి చెబితే దాన్ని చేట భారతం అంటారు. చేట అనేది వెదురుతో చేసే ఒక వస్తువు. దీనిని బియ్యం వంటి దినుసులు చెరగడానికి ఉపయోగిస్తారు. పూర్వం భారత గ్రంథాన్ని చేటంత పరిమాణంలో ఉండే కాగితాలపై ముద్రించేవారని చెబుతారు. ఆ గ్రంథాల్లో పద్యాలు చాలా చిన్న చిన్న పంక్తుల్లో ఉండేవి. వాటిని ‘చేట భారతాలు’ అని పిలిచేవారు. కాలక్రమేణా చిన్న విషయాన్నీ అతిగా విపులంగా చెప్పేవారిని చూసి ‘చేట భారతం చెబుతున్నాడు’ అనడం మొదలైంది’ అంది లచ్చవ్వ.

‘అంటే నా కథ నిజంగానే చేట భారతమే అన్నమాట!’ అని తల గోక్కుంటూ అన్నాడు రుద్రాంశ్. ‘అవును!’ అంటూ పిల్లలంతా ఒక్కసారిగా నవ్వేశారు. ‘ఇక మీదట కథను క్లుప్తంగా చెబుతాను’ అన్నాడు రుద్రాంశ్. ఆ మాటకు లచ్చవ్వ కూడా ముసిముసిగా నవ్వుకుంది.

నీతి: చెప్పాల్సిన విషయాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా చెప్పడం మంచిది. అనవసరంగా సాగదీయకూడదు.

- కాశీ విశ్వనాథం పట్రాయుడు

94945 24445.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్