అడవి మధ్యలో ఉన్న ఓ పెద్ద మర్రిచెట్టు వేర్ల దగ్గరికి చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న వేలాది చీమలు వరుసలుగా వచ్చాయి. ఒక విశాలమైన వలయంలో కూర్చున్నాయి. అందులో నల్ల చీమలు, ఎర్ర చీమలు, కుట్టే చీమలు, రెక్కల చీమలు.. ఇలా అన్ని జాతుల చీమలు ఒకేచోట చేరాయి. మధ్యలో ఒక పెద్ద రాతిపై రాణి చీమ నిలబడి ఉంది. ఆమె చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది.
‘మిత్రులారా..!’ అని రాణి చీమ గంభీరంగా ప్రారంభించింది. ‘మన నివాసాలను మనుషులు ఒక్కొక్కటిగా ఆక్రమిస్తున్నారు. ఇళ్లలో మనం కనిపిస్తే మందులు చల్లుతున్నారు. పొలాల్లో పంటలతో పాటూ మన ప్రాణాలూ పోతున్నాయి. ఆహారం దొరికే దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇలాగే కొనసాగితే మన భవిష్యత్తు ఏమవుతుంది? మన బాధలను ముఖ్యమంత్రికి చెప్పాలా? లేక ప్రకృతినే ఆశ్రయించాలా? మీ అభిప్రాయాలు చెప్పండి. అందరం కలిసి మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం’ అంది.
వెంటనే ఒక వృద్ధ చీమ లేచింది. ‘రాణిగారూ! ఒకప్పుడు మనిషి ఇంట్లో పంచదార పాత్ర దగ్గరకు వెళ్తే పండగలా ఉండేది. ఇప్పుడు ఆరోగ్యం కోసం బెల్లం, ఇతర ప్రత్యామ్నాయాలు వాడుతున్నారు. ఆ బెల్లం ముక్కలను కొరకాలంటే చాలా కష్టపడుతున్నాము. ఇలాగైతే నాలాంటి వృద్ధులకు మాత్రం ఆహారం తెచ్చుకోవడం కష్టమవుతోంది.’ తన బాధను చెప్పుకుంది. సమావేశానికి వచ్చిన చీమలన్నీ నవ్వినా... ఆ నవ్వులోనూ బాధ కనిపించింది.
మరో చీమ నిలబడి ‘మనుషుల్లో మానవత్వం తగ్గుతుంది. ‘‘చిన్న ప్రాణులు..’ అనే జాలి కూడా లేదు. ఇంటి బయట కనిపించినా చంపేస్తున్నారు. మనం బతకడానికి స్థలం అడుగుతున్నామా?.. వాళ్ల పనులకు ఏమైనా అడ్డుపడుతున్నామా?, మనల్ని నివారించే పేరుతో ఎన్నో రకాల మందులు తెచ్చి, మన మీద చల్లేస్తున్నారు. మన నివాసాల్లో వారు వచ్చి ఫ్లాట్‌లు కట్టుకుంటున్నారు. మరి మనం ఎక్కడికి వెళ్లాలి యువరాణి!’. అని ఆవేశంగా మాట్లాడింది. ఆ మాటకు సభ మొత్తం నిశ్శబ్దమైంది. కొద్దిసేపటి తర్వాత మరో చీమ నిలబడి.. ‘మనుషులు మన గూళ్లను కూల్చేస్తున్నారు. ఆహారం తగ్గిస్తున్నారు. అయినా మనం అంతరించిపోవడం లేదు. ఎందుకో తెలుసా?’ అని అంది. అందరి చూపు ఆ చీమవైపు తిరిగింది.
‘ఎందుకంటే.. మన బలం మన సమూహంలో ఉంది. మనలో ఒక చీమ ప్రాణంపోతే.. ఇంకో చీమ ముందుకు వెళుతుంది. ఒక దారి మూసుకుపోతే మరో దారి వెతుక్కుంటాము. ఒక గూడు పోతే ఇంకో గూడు కట్టుకుంటున్నాము. మనం మన వారసులకు ఓటమిని వారసత్వంగా ఇవ్వం.. ప్రయత్నాన్నే వారసత్వంగా ఇస్తున్నాము’ అని చీమల గొప్పతనాన్ని చెప్పింది. ఆ మాటలకు రాణిచీమ చిరునవ్వు నవ్వింది.
అంతలో ఒక యువ చీమ చిరాకుగా లేచింది. ‘మన శ్రమ, పట్టుదల గురించి ఆలోచించేవాళ్లే లేరు. సినిమా వాళ్లకు కూడా గౌరవం లేదు. ఏ పని చేయని ఈగ మీద సినిమా తీశారు. కానీ మన గురించి ఒక్క సినిమా కూడా తీయలేదు.’ అంది. సభలో నవ్వులు వినిపించాయి. అప్పుడే వెనుక వరుసలో ఉన్న ఓ ముసలి చీమ నెమ్మదిగా ముందుకొచ్చింది.
‘మన గురించి సినిమా తీయలేదని బాధపడొద్దు. పాఠశాలల్లో పిల్లలకు పట్టుదల అంటే చీమ కథే చెబుతున్నారు. స్కాట్లాండ్ రాజు ఒక చీమను చూసి పట్టుదలగా యుద్ధం చేశారు. ఇప్పటికీ ఈ కథ చెప్పుకుంటారు.. కానీ విచిత్రం ఏమిటంటే.. కథ మాత్రం చదువుతున్నారు. అక్కడే వదిలేస్తున్నారు. మనం కనిపిస్తే మాత్రం చంపేస్తున్నారు’ అంది.
రాణిచీమ ‘మిత్రులారా! మనం మనుషులను అడిగేది భూమి కాదు. భూమి మీద బతికే హక్కుని..’ అని గంభీరంగా అన్నది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. రాణి చీమ మాటలు పూర్తయ్యాక సభలో కాసేపు నిశ్శబ్దం అలుముకుంది. ‘సరే మిత్రులారా! సమావేశానికి కొంత విరామం తీసుకుందాం. మళ్లీ మాట్లాడుకుందాం’ అంది. వెంటనే అన్ని చీమలూ దగ్గర్లో ఉన్న పంచదార టీ తాగి, సభను కొనసాగించాయి.
అరగంట తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. రాణిచీమ అందరినీ ఒకసారి చూసింది. వెంటనే వెనుక నుంచి ఒక చిన్న చీమ లేచింది. ‘రాణిగారూ! మరి మనం నిజంగానే ముఖ్యమంత్రిని కలవాలా?’ అని అడిగింది.
రాణి చీమ ‘లేదు..’ అంది
‘మరి ఎవరిని కలవాలి?’ రాణి చీమ కాసేపు మౌనంగా ఉంది. ‘మిత్రుల మాటలు విన్నాక.. నాకు ఒక విషయం అర్థమైంది. మనం కలవాల్సింది ముఖ్యమంత్రిని కాదు..’ అని రాణిచీమ ఏదో చెప్పబోయి ఆగింది. చీమలన్నీ- రాణిచీమ ఏమి చెబుతుందా? అని ఉత్కంఠగా చూడసాగాయి.
‘మనుషుల మనసును..!’ అంది. సభలో ఉన్న చీమలన్నీ ఆశ్చర్యంగా చూశాయి.
‘ఎందుకంటే చట్టాలు అడవులను కాపాడగలవు. కానీ మనసు లేకపోతే ప్రకృతిని కాపాడలేవు. ధనవంతులు కావాలనే స్వార్థంతో కొంతమంది కొండలను తవ్వుతున్నారు, అడవులను నరుకుతున్నారు. పేదలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు’ ఆ మాటకు చీమలన్నీ చప్పట్లు కొట్టాయి.
రాణి చీమ చివరిసారిగా అందరినీ చూసింది. ‘మన గురించి ఎవరూ సినిమా తీయకపోవచ్చు. మన కోసం ఎవరూ విగ్రహాలు కట్టకపోవచ్చు. మన పేరు మీద ఎవరూ అవార్డులు ఇవ్వకపోవచ్చు. కానీ ప్రపంచంలోని ప్రతి పాఠశాలలో... ‘పట్టుదల..ఐక్యత’ అనే పదం చెప్పినప్పుడల్లా.. మనమే మొదటి ఉదాహరణగా నిలుస్తాం.’ సభలో ఒక చీమ పెద్దగా విజిల్ వేసింది.
‘అందుకే మన పోరాటం ఆగకూడదు. వాళ్లు ఎంతగా మనల్ని భూమి మీద లేకుండా చేయాలని చూసినా పట్టుదలగా మనం బతికి చూపిద్దాం. మనుషుల మనసు మారే వరకూ వాళ్లతోనే వాళ్ల ఇళ్లలోనే మనం జీవిద్దాం’ అని ముగించింది రాణిచీమ. చీమలు అన్నీ తృప్తిగా.. మరింత బలంగా ముందుకు కదిలాయి. అవి వచ్చిన వరుసలోనే మళ్లీ తమ నివాసాలకు వెళ్లాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ మర్రిచెట్టు మీద కూర్చున్న గోరింక ‘మనుషులు చీమలను అంతం చేయడానికి ఎన్నో మందులు కనిపెట్టారు. కానీ.. చీమల ఐక్యతను, క్రమశిక్షణను, పట్టుదలను చంపే మందు మాత్రం ఎప్పటికీ కనిపెట్టలేరు’ అనుకుంది.
పద్మావతి
9490559477








కామెంట్‌లు (0)