ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రాగానే వీరేశం గుండె ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది. ఆదర్శవంతమైన విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎన్నో ఆశలతో పదో తరగతి గదిలో అడుగుపెట్టాడు. కానీ, గదిలోని దృశ్యం ఆయనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన లోపలికి వచ్చినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఒక మూల కొందరు డెస్కులు వాయిస్తున్నారు, మరొకవైపు అసభ్యకరమైన సైగలు, బూతు మాటలు, వెకిలి నవ్వులు. వీరేశం ఎంత గట్టిగా అరిచినా వారి గోల ముందు ఆయన గొంతు మూగబోయింది. ఆ రోజు సాయంత్రం వీరేశం ఇంటికి వెళ్లేసరికి తీవ్రమైన తలనొప్పి, కళ్ళల్లో నీళ్లు. ‘ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేద్దామా?’ అనే ఆలోచన కూడా వచ్చింది.
కానీ ఆ రాత్రి ఆలోచిస్తుంటే ఆయనకు ఒక విషయం అర్థమైంది.. ‘కోపం, కేకలు వీరికి అలవాటైపోయాయి. నా కోపాన్ని చూసి వారు ఆనందిస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళు ఊహించని విధంగా ప్రవర్తించాలి!’ అని వీరేశం ఒక వినూత్నమైన ప్రణాళిక వేసుకున్నాడు. మరుసటి రోజు వీరేశం క్లాస్‌కి వెళ్లాడు. పిల్లలు ఎప్పటిలాగే అల్లరి మొదలుపెట్టారు. కానీ వీరేశం కోప్పడలేదు, పాఠం చెప్పలేదు. ఆయన ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా వెళ్ళి, చివరి బెంచ్ మీద కూర్చున్నాడు. ఒక చేతిలో పుస్తకం పట్టుకుని, దాన్ని చదువుకుంటూ పిల్లల వైపు చూస్తూ ఉండిపోయాడు. ఫస్ట్ పీరియడ్ అయిపోయింది.. వీరేశం మౌనంగానే ఉన్నాడు. రెండో రోజు కూడా అలాగే.. మూడో రోజు పిల్లల్లో అసహనం మొదలైంది. ‘ఈ సార్ ఏంటి మనల్ని తిట్టడు, పాఠం చెప్పడు, ఊరికే చూస్తున్నాడు?’ అని అనుకున్నారు. నాలుగో రోజు వీరేశం బోర్డు దగ్గరకు వెళ్ళి, నల్లబల్ల మీద పెద్ద అక్షరాలతో ‘మీ జీవితం... మీ చేతుల్లో’ అని రాసి, ఒక కాగితాన్ని టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయారు. తరగతిలో బాగా అల్లరి చేసే మహేష్ ఉత్సుకతతో ముందుకొచ్చి, ఆ కాగితం తీసి చదివాడు. అందులో వీరేశం ఇలా రాశాడు:
‘నాకు మీపై కోపం లేదు. మీ భవిష్యత్తు తలచుకుంటే బాధగా ఉంది. మీరు నన్ను గౌరవించకపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. నేను మీకు చదువు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు నేర్చుకోవాలనిపిస్తే నన్ను పిలవండి.’ ఆ మాటలు విద్యార్థుల మనసును తీవ్రంగా కలిచివేశాయి. అప్పటివరకూ ఉపాధ్యాయుల కోపాన్ని మాత్రమే చూసిన వారికి, వీరేశం చూపించిన ఈ బాధతో కూడిన మౌనం గుండెల్లో గుచ్చుకుంది.
మరుసటి రోజు వీరేశం క్లాస్‌లోకి రాగానే.. గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. మహేష్ ముందుకొచ్చి, ‘సార్... మమ్మల్ని క్షమించండి. మేము పద్ధతి మార్చుకుంటాం, మాకు పాఠం చెప్పండి’ అని తలదించుకుని అన్నాడు. మిగతా పిల్లలందరూ లేచి నిలబడ్డారు. ఆ రోజు నుంచి వీరేశం పాఠాలతో పాటు జీవిత సత్యాలను, క్రీడలను, కథలను జోడించి బోధించడం మొదలుపెట్టాడు. పిల్లలకు చదువు మీద శ్రద్ధ పెరిగింది. తరగతి గది ఒక ఆశ్రమ వాతావరణంలా మారింది.
కొన్నేళ్ల తర్వాత.. ఒక ప్రముఖ నగరంలో ఐఏఎస్ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేష్, తన మొదటి ప్రసంగంలో వేదికపై ఉన్న వీరేశం మాస్టారి కాళ్ళకు నమస్కరించి ఇలా అన్నాడు: ‘నాడు మా సార్ మాపై కోప్పడి ఉంటే మేము నేరస్తులుగా మారేవాళ్లమేమో. కానీ ఆయన పాటించిన ఆ 'మౌనం', చూపించిన ప్రేమ నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి.’ అని సభలోని వారందరి చప్పట్ల మధ్య చెప్పాడు. వీరేశం కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలాయి.
యాడవరం చంద్రకాంత్ గౌడ్
94417 62105







కామెంట్‌లు (0)