గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసహాయం..

22 గంటల క్రితం

katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 04:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అనగనగా ఒక దట్టమైన అందమైన అడవి. ఆ అడవిలో ఎన్నో రకాల చెట్లు, వాటిపై కిలకిలరావాలు చేసే పక్షులు, కింద చెంగుచెంగున ఎగిరే కుందేళ్లు ఎంతో సంతోషంగా నివసించేవి. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద, పచ్చని వృక్షం ఉంది. అది ఎందరికో నీడను, పండ్లను ఇస్తూ అందరితో స్నేహంగా ఉండేది. ఇలా ఉండగా, ఒకరోజు ఆ అడవిలోకి ఒక కట్టెలు కొట్టేవాడు ప్రవేశించాడు. అతడు తన జీవనం కోసం అడవిలోని చెట్లను ఒకదాని తర్వాత ఒకటి నరకడం ప్రారంభించాడు. అలా నరికిన కట్టెలను నగరంలో అమ్ముకుని బతికేవాడు. కొన్ని రోజుల్లోనే ఎన్నో చెట్లు నేలకూలాయి.

ఒకరోజు సాయంత్రం ఆ కట్టెలు కొట్టేవాడు అడవి మధ్యలో ఉన్న ఆ పెద్ద వృక్షం దగ్గరకు వచ్చాడు. దాని పరిమాణాన్ని చూసి, ‘అబ్బా! ఎంత పెద్ద చెట్టు! రేపు పొద్దున్నే వచ్చి మొదట దీన్ని నరకాలి. చాలా కట్టెలు వస్తాయి. మంచి లాభం ఉంటుంది’ అనుకుని ఇంటికి వెళ్లాడు. అతడి మాటలు విన్న ఆ పెద్ద చెట్టు భయంతో వణికిపోయింది. సరిగ్గా అదే సమయంలో, కట్టెలు కొట్టేవాడు అంతకుముందు నరికేసిన చెట్లపై నివసించే పక్షులన్నీ ఇళ్లు కోల్పోయి, దిక్కుతోచక ఆ పెద్ద చెట్టు దగ్గరకు వచ్చాయి. పక్షులన్నీ దీనంగా, ‘పెద్ద వృక్షమా! ఆ కట్టెలు కొట్టేవాడు మా ఇళ్లను, మా చెట్లను నరికేశాడు. మాకు ఉండటానికి వేరే చోటు లేదు. దయచేసి నీ కొమ్మలపై మాకు కొద్దిగా చోటు ఇవ్వవా?’ అని వేడుకున్నాయి.

అప్పుడు ఆ పెద్ద చెట్టు, ‘పక్షులారా! నాకైతే మీకు ఆశ్రయం ఇవ్వాలని ఉంది. కానీ, ఆ కట్టెలు కొట్టేవాడు రేపు ఉదయమే నన్ను కూడా నరకాలని అనుకుంటూ వెళ్లాడు. రేపు నేను కూడా కూలిపోతాను. కాబట్టి నాపై గూళ్లు కట్టుకుంటే మీకే నష్టం’ అని చెప్పింది. కానీ ఆ పక్షులు వెనక్కి తగ్గలేదు. ‘మిత్రమా! ఏది జరిగితే అది జరుగుతుంది. మనమందరం కలిసికట్టుగా సమస్యను ఎదుర్కొందాం. ప్రస్తుతానికి మాకు నువ్వు తప్ప వేరే మార్గం లేదు. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రాత్రికి మమ్మల్ని నీ నీడన చేరనివ్వు’ అని చెప్పి పెద్ద చెట్టును ఒప్పించాయి.

రెండు రోజుల పాటు ఆ అడవిలో వర్షం పడటంతో కట్టెలు కొట్టేవాడు రాలేకపోయాడు. ఈ లోగా వందలాది పక్షులు ఆ పెద్ద చెట్టుపై చేరి, అందమైన గూళ్లు కట్టుకుని ఆ చెట్టును ఒక చిన్న ప్రపంచంలా మార్చేశాయి. మూడో రోజు ఉదయాన్నే కట్టెలు కొట్టేవాడు పదునైన గొడ్డలి పట్టుకుని ఆ పెద్ద చెట్టును నరకడానికి వచ్చాడు. అతడు గొడ్డలి పైకెత్తేసరికి, చెట్టుపై నుంచి వందలాది పక్షుల కిలకిలరావాలు వినిపించాయి. పైకి చూస్తే... చెట్టు నిండా ఎన్నో పక్షులు, వాటి గూళ్లు, అందులో చిన్న చిన్న పక్షి పిల్లలు కనిపించాయి. అది చూసి కట్టెలు కొట్టేవాడి మనసు కరిగింది. ‘అయ్యో! నేను నా స్వార్థం కోసం ఈ ఒక్క చెట్టును కొట్టేస్తే... కేవలం రెండు రోజుల్లోనే దీనిపై ఇన్ని వందల పక్షులు ఆశ్రయం పొందాయే! దీన్ని నరికితే ఈ పక్షులన్నీ అనాథలవుతాయి. వీటన్నింటికీ నేను అన్యాయం చేసినవాడినవుతాను. ఇంత పాపానికి నేను ఒడిగట్టలేను’ అనుకున్నాడు. వెంటనే గొడ్డలిని కింద దించి, ఆ చెట్టును వదిలేసి వేరే ఎండిపోయిన చెట్ల వైపు వెళ్లిపోయాడు. అది చూసి ఆపద తొలగిపోయిందని పక్షులతో పాటు పెద్ద చెట్టు కూడా ఎంతో సంతోషించింది.

నీతి: ఒకరికి చేసే సహాయం ఎన్నటికీ వృథా పోదు. మనం ఇతరులకు మేలు చేస్తే, ఆ మేలే తిరిగి మనల్ని రక్షిస్తుంది.

– ధనలక్ష్మి

91237 72883


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్