బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశీతకన్ను

10 గంటల క్రితం

kathaa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒక ఆదివారం సాయంత్రం మునిమనవలు రుద్రాంశ్, కాత్యాయని, జున్నుబాబు ముగ్గురూ లచ్చవ్వతో ముచ్చట్లు చెబుతున్నారు. అంతలో ఆమె స్నేహితురాలు సోములమ్మ వీధి గుమ్మం దాటి లోపలికి వచ్చింది. ‘అయ్యో, సోములమ్మా! నా మీద శీతకన్ను వేసావేమో అనుకున్నాను. ఇన్ని రోజులు కనిపించలేదే!’ అంది లచ్చవ్వ నవ్వుతూ. ‘అలాంటిదేమీ కాదు. కొడుకు దగ్గరకు వెళ్లాను. నిన్ననే తిరిగి వచ్చాను’ అంది సోములమ్మ. ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు. అప్పుడే బయట వీధిలో గ్రామ పెద్దతో మాట్లాడుతున్న లచ్చవ్వ కొడుకు, ‘అయ్యా! అధికారులు మన ఊరి మీద శీతకన్ను వేశారు. ఎప్పుడో పూర్తవాల్సిన రోడ్డు పని ఇంకా మొదలుకాలేదు. ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు’ అన్నాడు. ఆ మాటలు విన్న జున్నుబాబు ఆశ్చర్యంగా లచ్చవ్వ వైపు తిరిగి, ‘లచ్చవ్వా! ఇప్పుడే నువ్వు సోములమ్మ గురించి "శీతకన్ను" అన్నావు. ఇప్పుడు బాబాయ్ ఊరి గురించి కూడా అదే అన్నాడు. ఇద్దరికీ ఒకే మాట ఎందుకు వాడారు?’ అని అడిగాడు.

జున్నుబాబు సందేహం విని లచ్చవ్వ చిరునవ్వు చిందించింది. ‘బాబూ! "శీతకన్ను" ఒక జాతీయం. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటే ఎదురుగా ఉన్న వాళ్లు కూడా సరిగా కనిపించరు. అందుకే పెద్దలు ఆ భావాన్ని పోల్చి, చాలాకాలం కనిపించకపోయినా లేదా ఒకప్పుడు చూపిన ప్రేమ, ఆదరణ తగ్గి పట్టించుకోకుండా వదిలేసినా "శీతకన్ను" అనే జాతీయాన్ని వాడుతుంటారు. నేనూ, నీ బాబాయ్ కూడా అదే అర్థంలో ఆ మాట వాడాం’ అని చెప్పింది. ఆ రోజు నుంచి "శీతకన్ను" అనే జాతీయం ఎక్కడ వినిపించినా, దాని అర్థం పిల్లలకు వెంటనే గుర్తుకొచ్చేది.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు

94945 24445.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్