అంధకారంలో పెదబయలు మండల కేంద్రం
పెదబయలు: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముఖ్యంగా సీతాగుంట పంచాయతీ పెద్దవీధి కాలనీ సమీపంలో ఒక భారీ చెట్టు విద్యుత్ స్తంభంపై విరిగిపడటంతో ఆ ప్రాంతమంతా అంధకారంలో మునిగిపోయింది. తీగలు తెగిపడి ప్రమాదకరంగా మారడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రమాదంపై స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ స్పందన కరువైంది. అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయి సిబ్బంది వచ్చినప్పటికీ, కూలిన చెట్టును తొలగించేందుకు వెనుకాడారు. దీంతో స్థానిక యువత కలిసి స్వచ్ఛందంగా శ్రమించి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించారు. అయినప్పటికీ, ప్రధాన విద్యుత్ అధికారులు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్ నిలిచిపోవడంతో స్థానిక గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు, సిబ్బంది తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.







కామెంట్‌లు (0)