అరకులోయ :
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, రైతు ఇతర ప్రజా సంఘాల పిలుపు మేరకు అరకులోయ మండల కేంద్రంలో శనివారం నిరసన నిర్వహించారు. జ్ఞానేశ్ కుమార్ దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని చేయనీయకుండా ప్రజా సంఘ నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని, బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న జ్ఞానేశ్ కుమార్ పై చర్య తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి అడ్డుకుంటుందని, ఇది ప్రజాస్వామ్యంకి విరుద్ధమని తెలిపారు. నిరసనకారులు రాకుండా ఢిల్లీలో మెట్రో రైళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ప్రజలు, యువత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళ మెత్తుతుందని, ఈ పోరాటానికి భయపడే అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తప్పు చేసింది జ్ఞానేశ్ కుమార్ అయితే బిజెపి కి ఎందుకు భయం పుట్టుకుందని ప్రశ్నించారు. 13 కోట్ల ఓట్లు తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తక్షణం తొలగించిన ఓట్లు పునరుద్ధరించి, సర్ ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ కాఫీ రైతు సంఘం కార్యదర్శి జి.చిన్న బాబు, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 45 లక్షల ఓట్లు తొలగించారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రభుత్వం పోరాడే వారి గొంతు నొక్కుతుందని, దీన్ని ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోవన్నారు. పోరాటాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. తక్షణం సీఈసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందనన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజు, మగ్గన్న, కోటేశ్వరరావు, మహదేవ్, రైతు సంఘం, గిరిజన సంఘం నాయకులు జగన్నాథం, హరి, సిపిఎం మండల కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)