అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన యువత సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత ప్రభుత్వ సేవల్లో ప్రవేశించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ కోచింగ్లో భాగంగా మూడో బ్యాచ్ శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం విశాఖపట్నంలోని వేపగుంట వైటిసిలో జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఐటీడీఏ పాడేరు ప్రాజెక్టు అధికారితో కలిసి ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమం 11 నెలల పాటు కొనసాగనుంది..
ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్థులు వ్యక్తిగతంగా కష్టపడి చదవడం, నిరంతరం సాధన చేయడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ఏదైనా అంశంలో ఇబ్బందులు ఎదురైతే అధ్యాపకుల సహాయం తీసుకోవాలని, సమాధానాల రచన, విశ్లేషణాత్మక ఆలోచన, సమయ నిర్వహణలో మెరుగుదల అవసరమైతే వాటిపై ప్రత్యేకంగా సాధన చేయాలన్నారు.సివిల్ సర్వీసెస్లో ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉద్యోగాన్ని సాధించడం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యాపరమైన పరిజ్ఞానంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం, ప్రజాసేవ పట్ల నిబద్ధత అవసరమని తెలిపారు.గిరిజన ప్రాంతాలకు చెందిన యువతకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం అందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, సివిల్ సర్వీసెస్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విజయం సాధించేలా ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు తమకు అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, స్పష్టమైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.శిక్షణ సమర్థవంతంగా వినియోగించుకుంటూ, నిరంతరం అధ్యయనం చేయడం, నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవాలన్నారు. తమ పురోగతిని సమీక్షించుకోవడం ద్వారా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. కొంతమంది స్వీయ అధ్యయనంతో విజయం సాధిస్తే, మరికొంతమందికి నిపుణుల మార్గదర్శకత్వం, క్రమబద్ధమైన కోచింగ్, అధ్యాపకులతో చర్చలు, నమూనా పరీక్షలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.కోచింగ్ ద్వారా అంశాలపై స్పష్టత, అధ్యయనంలో క్రమశిక్షణ, తమ బలాలు, బలహీనతలను గుర్తించే అవకాశం లభిస్తుందని తెలిపారు. తాత్కాలిక అపజయాలను తమ సామర్థ్యానికి కొలమానంగా భావించవద్దని అభ్యర్థులకు సూచించారు. పరీక్షల్లో ఎదురైన తప్పులను విశ్లేషించుకుని, పరిజ్ఞానంలో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. సందేహాలను నిర్భయంగా అడిగి తెలుసుకోవాలని, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, తోటి అభ్యర్థులతో చర్చల ద్వారా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభ్యర్థులకు ముఖ్యమైన సూత్రాలను వివరించారు.11 నెలల పాటు కొనసాగే ఈ శిక్షణా కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో తమ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.








కామెంట్లు (0)