ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం...

11 నవంబర్, 2026

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 08:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–14 బాలబాలికల రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను జిల్లా కలెక్టర్ టి. నిశాంతి బుధవారం ప్రారంభించారు.

​ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు.

సుమారు 300 మంది అండర్–14 బాలబాలికల క్రీడాకారులతో పాటు 24 మంది పురుష, మహిళా కోచ్‌లు, ఇతర అధికారులు పాల్గొంటున్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్‌కు జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు.టోర్నమెంట్‌ను ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్‌ను గిరిజన ప్రాంతమైన పాడేరులో నిర్వహించడం సంతోషకరమన్నారు.క్రీడలు కేవలం పోటీలకు మాత్రమే పరిమితం కాకుండా క్రమశిక్షణ, స్నేహభావం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యతోపాటు క్రీడలకు కూడా పాఠశాల విద్యలో సమాన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపకార వేతనాలు, నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతిభావంతులైన క్రీడాకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో నోటిఫై చేసిన క్రీడా రిజర్వేషన్లతో పాటు 3 శాతం స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లో కూడా పాల్గొనేలా ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. కోచ్‌లు, ఎంపిక కమిటీలు ఎలాంటి పక్షపాతం లేకుండా పూర్తిగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే క్రీడాకారులను ఎంపిక చేయాలని సూచించారు.టోర్నమెంట్‌లో పాల్గొంటున్న విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం, వైద్య సహాయం, అత్యవసర సేవలు, వసతి, రవాణా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాలికల భద్రత, గౌరవం, వ్యక్తిగత గోప్యత, సౌకర్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా, గౌరవప్రదంగా, ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కె. చిరంజీవి నాగ వెంకట సాహిత్, డీఈఓ భానుమూర్తి, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ పరిమళ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహన్ రావు, ఏడీ డీఎంహెచ్‌ఓ బాలకృష్ణయ్య, మధ్యాహ్న భోజన పథకం ఏడీ వేణుగోపాల్, సంబంధిత శాఖల అధికారులు, కోచ్‌లు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్