పర్యాటక రంగంలో ప్రసిద్ధి గాంచిన వంజంగి హిల్స్‌కు వెళ్లే రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్స డిమాండ్ చేశారు. ఇటీవల అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న రహదారిని మంగళవారం ఆయన పార్టీ నాయకులు, గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటకుల నుంచి లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా, రహదారిపై గుంతలు పూడ్చేందుకు కూడా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. వంజంగి కొండపై ఉన్న ఏడు గ్రామాల్లో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయని, వారి కనీస అవసరాలను పట్టించుకునే వారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో గర్భిణులు, రోగులను మండల కేంద్రానికి తరలించేందుకు రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామస్థులే స్వచ్ఛందంగా రహదారికి మరమ్మతులు చేసుకుంటామన్నా కేసులు పెడతామని అటవీశాఖ అధికారులు బెదిరించడం సరికాదన్నారు. పర్యాటక ప్రాంతం అభివృద్ధి పేరుతో ఆదాయం ఆర్జిస్తున్న అధికారులు, పరిసర గ్రామాల్లో తాగునీరు, సీసీ రహదారులు, పారిశుద్ధ్యం వంటి కనీస సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించడం లేదన్నారు. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధికి కూడా ఖర్చు చేయాలని కోరారు. ప్రభుత్వమే కాటేజీలు నిర్మించి వంజంగి, లాగిసపల్లి పంచాయతీల యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వంజంగి పంచాయతీ పరిధిలోని ఆటోలకు కొండపైకి రాకపోకలకు అనుమతించాలని, స్థానికంగా నైపుణ్యాలు కలిగిన వారికి చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కొండపై ఉన్న గ్రామాలను ఖాళీ చేయాలంటూ అటవీశాఖ అధికారులు జారీ చేసిన ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎన్నికల అనంతరం పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు లింగేరి సుందరరావు, వి. దాసుబాబు, గ్రామస్థులు ఎస్.కొండబాబు, నాగేశ్వరరావు, రామారావు, నీలన్న, శ్రీను, కోటబాబు, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
వంజంగి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి- సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 05:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)