అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం పిసి అండ్ పి ఎన్ డి టి చట్టం–1994ను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి, పిసి అండ్ పి ఎన్ డి టి చట్టం జిల్లా చైర్పర్సన్ ఎం. రియాజ్ బేగ్ ఆదేశించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, లింగాన్ని వెల్లడించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మంగళవారం పాడేరులోని డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి సలహా కమిటీ సబ్-డిస్ట్రిక్ట్ స్థాయి సలహా కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పిసి అండ్ పి ఎన్ డి టి చట్టం అమలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల నిర్వహణ, చట్ట నిబంధనల పాటింపు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.జిల్లాలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ రెన్యువల్, వాటి నిర్వహణ, పనితీరును సమీక్షించారు.ప్రతి స్కానింగ్ కేంద్రం పీసీ అండ్ పి ఎన్ డి టి చట్టం–1994, నిబంధనలు–1996 ప్రకారం నిర్దేశించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.స్కానింగ్ కేంద్రాల్లో నిర్వహించే రికార్డులు, ఫారమ్‌లు, సంబంధిత రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడంతో పాటు, అధికారుల తనిఖీల సమయంలో అవసరమైన వివరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆడపిల్లల సంరక్షణ, బాలికల పట్ల సమానత్వ భావన పెంపొందించడం, సమాజంలో లింగ వివక్షను నివారించడం, జిల్లాలో లింగ నిష్పత్తి సమతుల్యతను కాపాడేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.చట్టంలోని నిబంధనలపై వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలని తెలిపారు., గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను నిరోధించడం, ఆడపిల్లల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.







కామెంట్లు (0)