ప్రజాశక్తి - పాడేరు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే పంచాయతీల స్థాయిని బట్టి రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం నుంచి నగదుప్రోత్సాహకం అందుతుందని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి సూచించారు. అల్లూరి జిల్లాలో మూడు మండలాల్లో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు 2,076 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు.
రెండో విడతలో ఈనెల 20వరకు నామినేషన్లకు గడువు ఉందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోందన్నారు. గ్రామాల్లో ఐక్యత, సామరస్యం, అభివృద్ధి దృక్పథాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవాలను ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందన్నారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు
ఐదు వేల జనాభాఉన్న పంచాయతీ ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు.5,001 నుంచి 10వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు. 10వేలు పైబడి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షలు. ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు గతంలో అమలులో ఉన్న ప్రోత్సాహకాలతో పోలిస్తే ప్రభుత్వం ప్రోత్సాహక మొత్తాలను గణనీయంగా పెంచిందన్నారు. ..సంబంధిత ఎన్నికల అధికారులు ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారికంగా ఏకగ్రీవ ఎన్నికను ప్రకటించాలని. ప్రోత్సాహకానికి అర్హతను సంబంధిత అధికారులు పరిశీలించి ధృవీకరించిన అనంతరం నిబంధనల ప్రకారం ప్రోత్సాహక నగదు అందజేస్తారన్నారు. గ్రామాల్లో అనవసర పోటీలు, విభేదాలకు తావు లేకుండా ప్రజలంతా పరస్పర సహకారం, ఐక్యతతో గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లా గ్రామ పంచాయతీ అధికారి సమర్పించిన నివేదిక ప్రకారం, కొయ్యూరు చింతపల్లి, జికె.వీధి మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 447, , వార్డు సభ్యుల స్థానాలకు 1,629 కలిపి మొత్తంగా 2,076 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు.
రెండో విడతలో పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి. మాడుగుల మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని, నామినేషన్ల దాఖలుకు గడువును 20వ తేదీగా నిర్ణయించారు.
నామినేషన్ల దాఖలులో ఆలస్యమొద్దు
అక్వాన్ తుఫాను ప్రభావంతో 20న జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో, పోటీకి ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడవు చివర వరకు వేచిచూడకుండాముందుగానే నామినేషన్లు దాఖలు చేయాలని కలెక్టర్ సూచించారు. వర్షాలతో నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురుకాకుండా అభ్యర్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నిర్ణీత తేదీల్లోనే నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, అభ్యర్థులందరూ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)