ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలను ఖండించండి

11 నవంబర్, 2026

ఆనక
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 12:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం

- బరితెగించిన రిగ్గింగ్‌.. ఇదేనా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం?

ప్రజాశక్తి - అనకాపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం సాగించిన అక్రమాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఈరోజు అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల పట్ల వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా మారిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లకుండా భయభ్రాంతులకు గురిచేయడం, రిటర్నింగ్ అధికారుల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కోవడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేయడం, బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని అన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల యంత్రాంగం అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని విమర్శించారు.

మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే ప్రజల భాగస్వామ్యంతో, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగే ఎన్నికల ద్వారా స్థానిక పాలనను ప్రజలే నిర్ణయించుకోవడం. కానీ నేడు అధికార కూటమి సాగిస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలు గ్రామ స్వరాజ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇటువంటి చర్యలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శంకర్రావు, సిపిఐ పట్టణ కార్యదర్శి తాకాసి వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా నాయకులు ఎంవి భద్రం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు, బొప్పే ఉమామహేశ్వరరావు, సిపిఎం నాయకులు కాళ్ళ తేలయ్య బాబు, కే ఈశ్వరరావు, సిపిఐ నాయకులు ఫణీంద్ర, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్