సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.పద్మ
ప్రజాశక్తి-అనకాపల్లి: సిపిఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. . జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంటా శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.పద్మ, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి.పద్మ మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ ద్వారా తన పోరాట ప్రస్థానాన్ని ప్రారంభించిన సీతారాం ఏచూరి జాతీయ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారని అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సాగించిన పోరాటాలు, నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సైతం నిలదీసిన తీరు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ప్రజా సమస్యలపై లోతైన అవగాహనతో, సిద్ధాంత నిబద్ధతతో జీవితాంతం ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకం, గిరిజనుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలు, సమాచార హక్కు చట్టం వంటి కీలక ప్రజా అనుకూల చట్టాల రూపకల్పన, సాధనలో ఏచూరి ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. పార్లమెంటరీ వేదికను ప్రజల హక్కుల కోసం సమర్థవంతంగా వినియోగించి కార్మికులు, కర్షకులు, పేదలు, గిరిజనుల సమస్యలను బలంగా వినిపించారని అన్నారు. జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలో మతోన్మాద, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులను ఐక్యం చేయడంలో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఆయన చివరి వరకు పోరాడారని అన్నారు. మతోన్మాదాన్ని పెంచుతూ ప్రజల మధ్య విభజనలు సృష్టించే శక్తులకు, దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలకు వ్యతిరేకంగా ఏచూరి బలమైన పోరాటం సాగించారని పేర్కొన్నారు. విద్యారంగంలో సమాన అవకాశాలు, శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి, విద్యను ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ నుంచి కాపాడాలని ఏచూరి పోరాడారని అన్నారు. నేటి విద్యారంగంలో పరీక్షా పత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉందని జి.కోటేశ్వరరావు అన్నారు. మతోన్మాదాన్ని ఓడించి లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు కార్మికులు, కర్షకులు, పేదలు, విద్యార్థులు, యువత, మహిళల హక్కుల కోసం ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సీతారాం ఏచూరి ఆశయాల సాధన కోసం, సమసమాజ స్థాపన లక్ష్యంతో సిపిఎం కార్యకర్తలు పునరంకితం కావడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, ఆర్.రాము, బి.ఉమామహేశ్వరరావు, డి.డి.వరలక్ష్మి, సీనియర్ నాయకులు గండి నాయనబాబు, కె.ఈశ్వరరావు, పెంటకోట శ్రీనివాసరావు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)