ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్ఈజెడ్ నిర్వాసితులపై మరోసారి దౌర్జన్యం : తీవ్రంగా ఖండించిన సిపిఎం

10 అక్టోబర్, 2026

ఎస్ఈజెడ్ నిర్వాసితులపై మరోసారి దౌర్జన్యం
గ్రామంపైకి దండెత్తిన పోలీసులు, రెవెన్యూ అధికారులు
శాంతియుత నిరసనకు వేసిన టెంట్‌ పీకేసిన వైనం
తీవ్రంగా ఖండించిన సిపిఎం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

రాంబిల్లి మండలం అప్పన్నపాలెం, గొరపూడి గ్రామాల ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఇజెడ్) నిర్వాసిత రైతులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు శనివారం మరో సారి దౌర్జన్యానికి దిగారు. పదుల సంఖ్యలో రెవెన్యూ అధికారులు, వంద మందికి పైగా పోలీసులు అప్పన్నపాలెం గ్రామంపై దండెత్తారు. రెండు గ్రామాల రైతులు అప్పన్నపాలెంలో శనివారం శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి టెంట్‌ ‌వేయగా, దానిని పీకేశారు. బాధిత రైతులను భయబ్రాంతులకు గురి చేశారు. లారస్‌ ‌ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అప్పన్నపాలెం, గొరపూడి గ్రామాల పరిధిలో 576 ఎకరాల జిరాయితీ, ప్రభుత్వ భూముల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం విధితమే. అయితే ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం తమకు సరిపోదని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండగానే రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, ఆర్‌ అండ్‌ ఆర్‌ ‌ప్యాకేజీ అమలు చేయకుండా భారీగా పోలీసులను మోహరించి రెవెన్యూ అధికారులు భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన రైతులపై ఈ నెల 3వ తేదీన శనివారం ప్రభుత్వం దౌర్జన్యం చేసింది. ఈ వారంలో పోలీసులు 25 మందికి పైగా రైతులపై అక్రమ కేసులు, బైండోవర్‌ ‌పెట్టారు. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల రైతులు శనివారం అప్పన్నపాలెంలో శాంతియువంగా నిరసన తెలియజేయడానికి సిద్ధపడగా భారీగా పోలీసులను మోహరించి మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు.


తీవ్రంగా ఖండించిన సిపిఎం

ఎస్‌ఇజెడ్‌ ‌బాధిత రైతులపై ప్రభుత్వం, అధికారులు అనుసరిస్తున్న దౌర్జన్యపూరిత వైఖరి అత్యంత దుర్మార్గమైనదని సిపిఎం రాంబిల్లి మండల కార్యదర్శి జి దేముడు నాయుడు తీవ్రంగా ఖండించారు. నిర్వాసిత రైతుల న్యాయమైన పోరాటానికి సిపిఎం ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భూములు లాక్కుని, నేటికీ చట్టబద్ధమైన నష్టపరిహారం చెల్లించకుండా గ్రామాలను తరలిస్తామని చెప్తున్న అధికారులు వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారో, జీవనభృతి కింద ఎలాంటి ప్యాకేజీ ఇస్తారో స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ భూసేకరణ అంశం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు దౌర్జన్యంగా నిర్వాసితుల భూముల్లోకి ప్రవేశించడంపై ఆయన మండిపడ్డారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామాల్లో నిరసనగా కూర్చోవాలని ప్రయత్నించిన రైతులను పోలీస్, రెవెన్యూ యంత్రాంగం కలిసి అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రశ్నించే హక్కును, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా హరించడం దారుణమన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇటువంటి దౌర్జన్యపూరిత, అణచివేత చర్యలను తక్షణమే మానుకోవాలని, ఎస్ఈజెడ్ నిర్వాసిత రైతులకు చట్టప్రకారం రావలసిన పూర్తిస్థాయి నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు రత్తాలు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్