- జనసేన నుండి మోటూరు నాగమణి, పోతల భవాని, టిడిపి నుంచి కిలపర్తి రాజేశ్వరి, అమలకంటి రమణమ్మ ప్రయత్నాలు
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పదవి బిసి మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఈ పదవి కోసం జనసేన పార్టీకి చెందిన పరవాడ నుండి జెడ్పిటిసిగా ఎన్నికైన మోటూరు నాగమణి, బుచ్చయ్యపేట నుండి ఎన్నికైన పోతల భవాని, టిడిపి నుండి దేవరాపల్లి జెడ్పిటిసి కిలపర్తి రాజేశ్వరి, ఎస్.రాయవరం జెడ్పిటిసి అమలకంటి రమణమ్మతదితరులు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రధానంగా పరవాడ నుండి 3,590 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన మోటూరు నాగమణికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి దక్కవచ్చనే ప్రచారం ఆ మండలంలో జోరుగా సాగుతోంది. ఆమె భర్త మోటూరు సన్యాసి నాయుడుకు జనసేనలో ఉన్న గుర్తింపు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఈ చర్చకు ప్రాధాన్యతనిస్తున్నాయి. సన్యాసి నాయుడుకు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచి పంచకర్ల రమేష్ బాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. పంచకర్ల రాజకీయ ప్రస్థానంలో నమ్మకమైన అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఈ అనుబంధం నాగమణికి జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు దక్కేందుకు అనుకూలించే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే 2026 జూన్లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో సీనియర్ సభ్యుల ఎంపికలో సన్యాసినాయుడు మొదటి స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తలుగా నియమితులైన ఐదుగురిలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య నాగమణి భారీ మెజార్టీతో జెడ్పిటిసిగా విజయం సాధించడంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి దక్కవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి నాగమణిని వరిస్తే అనకాపల్లి తొలి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా నాగమణి రికార్డుల్లోకి ఎక్కనున్నారు.
ఇక టిడిపి నుండి మాడుగుల నియోజకవర్గానికి చెందిన దేవరాపల్లి జెడ్పిటిసిగా ఎన్నికైన కిలపర్తి రాజేశ్వరి కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జెడ్పి చైర్పర్సన్ పదవి టిడిపికి కేటాయిస్తే రాజేశ్వరికి అవకాశం కల్పించాలనే ప్రతిపాదనను బలంగా వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల బరిలో సాధించిన విజయం, గతంలో ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఆమెకు ప్రధాన అర్హతలుగా నిలుస్తున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు రాజకీయంగా పట్టున్న సొంత మండలం దేవరాపల్లిలో రాజేశ్వరి 3,504 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో వైసీపీకి బలమైన రాజకీయ కేంద్రంగా ఉన్న ఈ మండలంలో కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకోవడమే కాకుండా, మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు మండలంలో పార్టీ పునాదులు బలపడినట్లు స్పష్టం చేస్తున్నాయి. వ్యక్తిగత విజయంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి లభించిన ఈ ఆధిక్యం రాజేశ్వరి అభ్యర్థిత్వానికి రాజకీయంగా బలమైన వాదనగా మారుతోంది. రాజేశ్వరి భర్త కిలపర్తి భాస్కరరావు రాజకీయ వ్యూహాలు కూడా కీలక చర్చకు దారితీస్తున్నాయి. మండల రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడిగా, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో చురుకైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నాయకత్వంపై విధేయతతో పనిచేస్తున్న భాస్కరరావు, ఇప్పుడు తన సతీమణికి జిల్లా స్థాయిలో కీలక పదవి దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ మద్దతు కూడగట్టి పార్టీ అధిష్ఠానం దృష్టికి రాజేశ్వరి పేరును తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గతంలో ఎంపీ సీఎం రమేష్ సైతం జిల్లాలో మంచి పదవి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు స్థానికంగా చర్చ ఉండటం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం కల్పిస్తోంది. మరోవైపు మాడుగుల నియోజకవర్గానికి ఈ పదవి దక్కాలనే ఆకాంక్ష కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో కోల్పోయిన రాజకీయ పట్టును తిరిగి సాధించాలంటే మాడుగుల ప్రాంతానికి జిల్లా స్థాయిలో కీలక పదవి కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అభివృద్ధి పరంగానూ మాడుగుల నియోజకవర్గానికి జడ్పీ చైర్మన్ పదవి ప్రాధాన్యం సంతరించుకోనుంది.
వీరుతో పాటు జనసేన నుండి బుచ్చయ్యపేట నుండి జెడ్పిటిసిగా ఎన్నికైన పోతల భవాని, టిడిపి నుండి ఎస్.రాయవరం నుండి జెడ్పిటిసిగా ఎన్నికైన అమలకంటి రమణమ్మ కూడా జెడ్పి చైర్పర్సన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే చైర్పర్సన్ ఎంపికలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సర్దుబాట్లు కొలిక్కి వస్తే తప్పా ఈ పదవి ఎవరికి దక్కుతుందో చెప్పలేం.








కామెంట్లు (0)