ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డ్రగ్స్ రహిత సమాజానికి మీడియా పాత్ర కీలకం

6 రోజుల క్రితం

డ్రగ్స్ రహిత సమాజానికి మీడియా పాత్ర కీలకం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 07:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ విద్యా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజం – మీడియా, పోలీసుల పాత్ర అనే అంశంపై డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు నర్సీపట్నం టౌన్ సీఐ షేక్ గఫూర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర కీలకమని, ప్రజా సమస్యల పరిష్కారానికి పత్రికలు విశేష కృషి చేస్తున్నాయని తెలిపారు. నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగం కోసం కొన్ని ముఠాలు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని హెచ్చరించారు. ఇలాంటి ముఠాల సమాచారం తెలిస్తే 112కు లేదా నేరుగా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. గంజాయి రవాణా, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. డ్రగ్స్ రహిత సమాజానికి మీడియా పాత్ర కీలకం అన్నారు.


శ్రీవిద్య కళాశాల డైరెక్టర్ బోలెం అప్పన్నదొర మాట్లాడుతూ డ్రగ్స్ దుష్ప్రభావాలపై విద్యార్థులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.బిఎల్.స్వామి మాట్లాడుతూ, పలుచోట్ల జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఏ.డి. బాబు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏనుకూరి అప్పారావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు పసుపులేటి ప్రభాకర్, ఏపీఈఎంజేఏ నర్సీపట్నం ఏరియా కార్యదర్శి అప్పలనాయుడు, జర్నలిస్టులు రుత్తల నాగేశ్వరరావు (నాగు), శివ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్