అనకాపల్లి పట్టణంలో జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ అత్యంత సామరస్యంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరఫున అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్)తో పాటు 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకునే ఓటు హక్కు కలిగిన సభ్యులను (జడ్పీటీసీలను) మాత్రమే జడ్పీ కార్యాలయం లోపలికి అనుమతించడం జరుగుతుందని, ఇతరులకు లోపలికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు హాజరయ్యే జడ్పీటీసీ సభ్యుల వాహనాల పార్కింగ్ కోసం ఎన్టీఆర్ గ్రౌండడ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, పాత్రికేయుల (మీడియా) వాహనాల పార్కింగ్ కోసం జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పట్టణ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







కామెంట్లు (0)