ఎన్సీడీ సర్వేలో అత్యుత్తమ ప్రతిభ.. అవార్డు, ప్రశంసాపత్రం అందజేత
ప్రజాశక్తి - అనంతపురం : క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, అనుమానిత బాధితులను తదుపరి పరీక్షలు, చికిత్స నిమిత్తం ఉన్నత శ్రేణి ఆసుపత్రులకు తరలించడంలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్సీడీ)లో భాగంగా ... డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ... జిల్లాలో చేపట్టిన సర్వేలో క్యాన్సర్ అనుమానిత కేసులను గుర్తించడం, వారికి సకాలంలో తదుపరి వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకోవడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విశేష ప్రతిభ కనబరిచిందన్నారు. జిల్లాలోని వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంతోపాటు బాధితులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. అనంతపురం జిల్లా సాధించిన ఈ అత్యుత్తమ పనితీరును గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేసిందని ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని డీఎంహెచ్ఓ అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ సుమన్, నోడల్ అధికారి డాక్టర్ మిథున్ రాకేష్, డాక్టర్ సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)