మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన

6 రోజుల క్రితం

anantapuram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 11:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ముందస్తు పరీక్షలు, హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయవచ్చు

ప్రజాశక్తి బత్తలపల్లి: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచించారు. నవంబర్ 17న నిర్వహించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఆర్ డి టి ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమంలో భాగంగా బత్తలపల్లిలో సోమవారం, మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి మరణాలను గణనీయంగా తగ్గిస్తున్నారని తెలిపారు. మన దేశంలోనూ ఈ వ్యాధిపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొమ్మిది నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారికి వైద్యుల సూచన మేరకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. ప్రతి ఇంట్లోని ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ప్రాధాన్యతను తెలియజేసి, టీకాలు వేయించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.

లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

అసాధారణంగా తెల్లస్రావం కావడం, దుర్వాసనతో కూడిన తెల్లస్రావం, అధిక రక్తస్రావం, ఎక్కువ రోజులపాటు నెలసరి కొనసాగడం, భార్యాభర్తల కలయిక సమయంలో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 30 సంవత్సరాలు దాటిన మహిళలు వైద్యుల సలహా మేరకు పాప్‌స్మియర్, హెచ్‌పీవీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని తెలిపారు. ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌కు దారితీసే కణాలను గుర్తించి తగిన చికిత్స అందించవచ్చన్నారు. వ్యాధిని మొదటి, రెండో దశల్లో గుర్తిస్తే చికిత్సకు మెరుగైన ఫలితాలు ఉంటాయని, నాలుగో దశకు చేరుకున్న తర్వాత చికిత్స కష్టతరమవుతుందని వివరించారు. ప్రతి మహిళా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవడంతోపాటు తాను తెలుసుకున్న విషయాలను మరో పదిమందికి తెలియజేయాలని వైద్యులు పిలుపునిచ్చారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జ్యోతి, సుచిత్ర, హెచ్‌వైడీ, డాక్టర్ శిరీష, రషీదా, మానస, స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్