- ఎంపికపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు, పాలకవర్గం
ప్రజాశక్తి-హిందూపురం (అనంతపురం) : హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అంతర్జాతీయ స్థాయి సదస్సుకు ఎంపికయ్యారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముంబైలో నిర్వహించనున్న మూడవ ప్రపంచ మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మున్సిపల్ కమిషనర్ల జాబితాలో ఆయనకు చోటు లభించింది. రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ కమిషనర్, సంచాలకులు డాక్టర్ పి. సంపత్ కుమార్ ఈ మేరకు ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత స్థానిక స్వపరిపాలన సంస్థ వందేళ్ల వేడుకల్లో భాగంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మేయర్లు, నగర పాలక సంస్థల ప్రతినిధులు, పట్టణాభివృద్ధి నిపుణులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. పట్టణ పాలనలో వస్తున్న మార్పులు, నగరాల భవిష్యత్తు ప్రణాళికలు, కృత్రిమ మేధస్సు వినియోగం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన రవాణా వ్యవస్థ వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన 20 మంది కమిషనర్లను ఎంపిక చేయగా, వారిలో హిందూపురం కమిషనర్ మల్లికార్జున ఉండటం విశేషం. ఈ సందర్భంగా ఆయన ఎంపిక పట్ల హిందూపురం మున్సిపల్ ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై పట్టణ పాలనకు సంబంధించిన అనుభవాలను పంచుకునే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.








కామెంట్‌లు (0)