23న ప్రమాణ స్వీకారం.....
ప్రజాశక్తి-కదిరి అర్బన్ (అనంతపురం) : ఈనెల 23వ తేదీన చైర్పర్సన్ నూతనంగా ఎంపికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేపడతారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలోని హిందూపురం రోడ్డులోని విజన్ (నూతన ఎమ్మెల్యే కార్యాలయం) నందు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లతో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమావేశం నిర్వహించారు.ఈ నెల 23వ తేదీన నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో, పట్టణ అభివృద్ధి మరియు మున్సిపల్ పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యే వారితో చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న ఆశావహులతో ఎమ్మెల్యే మాట్లాడి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, అందరి సమక్షంలో పారదర్శకంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక విషయంలో గతంలో మాట ఇచ్చిన వారిలో, ఎన్నికల సమయంలో నమ్మకద్రోహానికి పాల్పడిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కో-ఆప్షన్ పదవి కేటాయించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.కొత్తగా ఎన్నికైన యువ కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకొని, సబ్జెక్ట్ పరంగా మరియు అజెండా అంశాలపై స్పష్టంగా, సమర్థవంతంగా మాట్లాడటం నేర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చురుకుగా కృషి చేయాలని, కౌన్సిల్ సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపి పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు.అలాగే ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కరూ అవినీతికి దూరంగా ఉండాలని, పారదర్శకత, నిజాయితీతో ప్రజాసేవ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సొమ్ముకు బాధ్యత వహిస్తూ, ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ నిబద్ధతకు, కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తల గౌరవం మరియు విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తూ, పట్టణ అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.








కామెంట్లు (0)