ఆత్మకూరులో తీవ్ర నీటి సమస్య
సమస్య ఉందని చెప్పిన పట్టించుకోని అధికారులు..
ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో తాగునీటి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదనీ, వాటర్ మెన్ లు కూడా స్పందించలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వారంతా ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారం రోజులుగా మంచి నీళ్లు రాలేదని చెప్పినా నీళ్లు రావు అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. మంచి నీళ్ల కోసం స్థానికులు, సత్య సాయి కార్మికులు కలిసి పొలాల బాట పడుతున్నారని తెలిపారు. 5 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని వాటర్ పంపింగ్ సిబ్బంది సమ్మెలకు దిగడంతో సత్యసాయి పంపులు ఆఫ్ అయ్యాయని చెప్పారు. కానీ అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో తాగడానికి మంచి నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారనీ, నీళ్లు లేని సమయంలో ట్యాంకర్ ద్వారానైనా మంచినీటిని సరఫరా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరారు. లేకపోతే నిరసన చేపట్టి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని కాలనీవాసులు, సిపిఎం నాయకులు హెచ్చరించారు.








కామెంట్‌లు (0)