బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

52 నిమిషాల క్రితం

Sexual assault on minor girl: Accused sentenced to life imprisonment.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 03:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం.. మచిలీపట్నం ప్రత్యేక పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు

నేరం రుజువు కావడంతో చనిపోయేవరకు జైలు శిక్ష..

ఏలూరు జిల్లా పోలీసుల పర్యవేక్షణతో కేసుకు ముగింపు


ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ (మచిలీపట్నం) : మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి మచిలీపట్నం ప్రత్యేక పోక్సో న్యాయస్థానం జీవితాంతం జైలు శిక్ష విధించింది. నిందితుడు కాగిత గంగాప్రసాద్‌కు చనిపోయే వరకు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించిన న్యాయస్థానం.. బాధిత బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2019లో నమోదైన ఈ కేసులో దాదాపు ఏడేళ్ల అనంతరం న్యాయస్థాన తీర్పు వెలువడింది.


సంరక్షణలో ఉన్న బాలికపై అఘాయిత్యం ....

2019 నవంబరు 12న రాత్రి బాలిక తల్లి తన భర్త, పెద్ద కుమార్తెతో కలిసి కైకలూరు సంతకు వెళ్లింది. నిద్రిస్తున్న మూడేళ్ల 11 నెలల చిన్నారిని ఇంట్లో నిందితుడి సంరక్షణలో ఉంచారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నిందితుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాలిక ఏడవడంతో ఆమెను కొట్టి ఇంటి బయటకు తీసుకువచ్చి పడుకోబెట్టినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో తల్లి ఇంటికి చేరుకుని కుమార్తె ప్రవర్తనను గమనించి ప్రశ్నించడంతో బాలిక జరిగిన విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో బాలికను వైద్యుడి వద్దకు తీసుకెళ్లిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఆధారాలతో నిందితుడిపై అభియోగాలు ....

ఫిర్యాదు అందుకున్న మండవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి గుడివాడ ఉప పోలీసు అధికారి సత్యానందం ఆధ్వర్యంలో సాక్షులను విచారించి, కీలక ఆధారాలను సేకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది నరసింహారావు 12 మంది సాక్షులను విచారించారు. సాక్ష్యాధారాలు, వాదనలు పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించింది.


కోర్టు పర్యవేక్షణతో సత్వర న్యాయం ....

ఏలూరు జిల్లా పోలీసు అధికారి ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు కోర్టు పర్యవేక్షణ విభాగం ఈ కేసును నిరంతరం పర్యవేక్షించింది. కేసు దర్యాప్తు, విచారణలో సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. ఫలితంగా నిందితుడికి కఠిన శిక్ష పడటంతో పాటు బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం లభించింది. బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు నేరస్థులు శిక్ష నుంచి తప్పించుకోకుండా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కోర్టు పర్యవేక్షణ విభాగం పనిచేస్తోంది. ఇప్పటివరకు ఈ విభాగం పర్యవేక్షణలో 70 కేసుల్లో 83 మంది నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు, విచారణలో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా పోలీసు అధికారి అభినందించి రూ.500 నగదు పురస్కారం ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్