బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మధ్యప్రదేశ్‌లో మూడవ రోజుకి చేరిన మెడికల్‌ ఇంటర్న్స్‌ నిరసన

57 నిమిషాల క్రితం

medical interns  protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 04:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న మెడికల్‌ విద్యార్థుల ఆందోళన బుధవారంతో మూడవ రోజుకి చేరుకుంది. స్టైఫండ్‌ పెంపు కోరుతూ వీరంతా గత రెండు రోజులుగా కమలాపార్క్‌ కూడలిలో ఆందోళన చేపడుతున్నారు. వేర్వేరు ప్రభుత్వాస్పత్రికి చెందిన వైద్యులు కూడా బుధవారం నిరసనలో పాల్గొన్నారు. స్టైఫండ్‌ను రూ.14,337 నుండి రూ.30,000లకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరి నిరసనకు సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు కూడా మద్దతు ప్రకటించారు. ఆందోళనలో భాగంగా భోపాల్‌లోని ప్రభుత్వ గాంధీ మెడికల్‌ కాలేజీ (జిఎంసి)కి చెందిన వైద్యులు బుధవారం ఔట్‌ పేషెంట్‌ విభాగం (ఒపిడి) సేవలను బహిష్కరించారు. రెండు రోజుల క్రితం తమ సహచరులు చేపట్టిన నిరసనపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పాటు వాటర్‌ కెనాన్‌లు ప్రయోగించారని మెడికల్ ఇంటర్న్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు.

ఇతర రాష్ట్రాల్లోని మెడికల్‌ ఇంటర్న్స్‌ సగటున నెలకు సుమారు రూ.30,000 స్టైపెండ్ పొందుతున్నారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఛింద్వారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీకి చెందిన ఇంటర్న్ డాక్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. మెడికల్‌ ఇంటర్న్స్‌ సోమవారం చేపట్టిన శాంతియుత నిరసనపై పోలీసులు లాఠీచార్జికి, వాటర్ కెనాన్లకు పాల్పడ్డారని, ఈ ఘటనలో కొందరు వైద్యులు గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను అంగీకరించేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కితగ్గేది లేదని సాగర్‌లోని బుందేల్‌ఖండ్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన మరో వైద్యులు మాధవ్‌ శర్మ పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం స్టైఫండ్‌ను పెంచుతామని హామీ ఇస్తుందే కానీ , పెంచడం లేదని జిఎంసి వైద్యులు అనురాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా ఉన్నతాధికారులు, స్థానిక నేతలను కలిశామని, వినతిపత్రాలు సమర్పించామని అన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. అత్యవసర సేవలను కొనసాగిస్తున్నామని, మరోవైపు శాంతియుతంగా నిరసన చేపడుతున్నామని అన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చేంత వరకు నిరసన చేపడతామని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్