మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డప్పు, చర్మకారుల పెన్షన్‌కు సర్టిఫికెట్‌ మెలిక

09 సెప్టెంబర్, 2026

Certificate hurdle for Dappu artists' and cobblers' pensions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 03:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మూడో రోజూ ప్రగతి భవన్‌ వద్ద దరఖాస్తుదారుల పడిగాపులు

ధ్రువీకరణ పత్రం జారీకి మార్గదర్శకాలు రాలేదంటున్న సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు

దిక్కుతోచని స్థితిలో పెన్షన్‌ ఆశావహులు


ఒంగోలు సిటీ (ప్రకాశం) : ప్రభుత్వం నూతన పెన్షన్ల కోసం ఈ నెల 7న నోటిఫికేషన్‌ జారీ చేయగా, డప్పుకళాకారులు, చర్మకారుల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేవారికి ధ్రువీకరణ పత్రం కొత్త చిక్కుగా మారింది. డప్పుకళాకారులు, చర్మకారులుగా ధ్రువీకరిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ నుంచి సర్టిఫికెట్‌ పొందిన తరువాతే గ్రామ, వార్డు సచివాలయంలో ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉండటంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్‌ జారీకి తమకు కమిషనర్‌ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, మార్గదర్శకాలు అందలేదని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో వరుసగా మూడో రోజూ దరఖాస్తుదారులు ప్రగతి భవన్‌ చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్నారు.


పెన్షన్‌ దరఖాస్తుకు ఆధార్‌, కులం, ఆదాయం, రేషన్‌ కార్డు ధ్రువీకరణ పత్రాలు అవసరం కాగా, ఆధార్‌, రేషన్‌ కార్డు వంటి పత్రాలు ఇప్పటికే దరఖాస్తుదారుల వద్ద ఉన్నాయి. కులం, ఆదాయం వంటి ధ్రువీకరణ పత్రాలను కూడా సచివాలయం ద్వారా పొందే అవకాశం ఉంది. అయితే డప్పుకళాకారులు, చర్మకారులుగా గుర్తిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసే ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేయడంతో అసలు సమస్య ఏర్పడింది.


గతంలో సెల్ఫ్‌ డిక్లరేషన్‌.. ఇప్పుడు సర్టిఫికెట్‌ ....

గతంలో డప్పుకళాకారులు, చర్మకారులుగా సెల్ఫ్‌ ధ్రువీకరణను ఆమోదించిన ప్రభుత్వం ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేయడంపై దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులకు గడువు విధించిన ప్రభుత్వం, అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం వల్ల తమ పరిస్థితి అయోమయంగా మారిందని వారు వాపోతున్నారు.


మూడు రోజులుగా నిరీక్షణ ....

సర్టిఫికెట్ల కోసం మూడు రోజులుగా ప్రగతి భవన్‌కు వస్తున్నా స్పష్టమైన సమాచారం అందడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సాంఘిక సంక్షేమ శాఖకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసి, అర్హులైన డప్పుకళాకారులు, చర్మకారులకు ధ్రువీకరణ పత్రాలు అందించే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నారు. దరఖాస్తుకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్