ఎన్నికల శిక్షణ.. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఒకే రోజు ....
ఉపాధ్యాయుల్లో గందరగోళం.. వాయిదా వేయాలి : ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్
ప్రజాశక్తి - అనంతపురం : అక్టోబర్ 24 న ఉపాధ్యాయులకు ఎన్నికల శిక్షణ కార్యక్రమంతోపాటు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను కూడా నిర్వహించేందుకు షెడ్యూల్ చేయడంతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ ... ఒకే రోజు రెండు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఏ కార్యక్రమానికి హాజరు కావాలో తెలియక ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణకు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ, సంబంధిత ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. అక్టోబర్ 24న నిర్వహించాల్సిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని లేదా ప్రత్యామ్నాయ తేదీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రెండు కార్యక్రమాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను వెంటనే జారీ చేసి ఉపాధ్యాయుల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులపై అనవసర ఒత్తిడి పడకుండా, విధుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలని నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)