న్యూఢిల్లీ : ఎస్‌బిఐ డేటా లీక్, ఆ డేటా డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమవడంపై సిపిఐ(ఎం) ఎంపి ఎ.ఎ.రహీం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. సమాచారం లీక్ కావడంపై సమగ్ర విచారణ చేపట్టాలని, వినియోగదారుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. మొబైల్ నెంబర్లు, ఇమెయిల్ చిరునామాలు, బ్రాంచ్ వివరాలు, రుణ వివరాలతో సహా వినియోగదారుల సున్నితమైన సమాచారం బహిర్గతమైనట్లు వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయని అన్నారు. ఎంతమంది వినియోగదారులు ప్రభావితమయ్యారు, ఈ సమాచారం ఎలా లీక్ అయింది, ఏ పరిస్థితుల్లో బహిర్గతమైంది అన్న వివరాలపై ఇంకా స్పష్టత రాకపోవడం మరింత ఆందోళనకరమని ఎంపి రహీమ్ పేర్కొన్నారు. ఎస్‌బిఐ ప్రభుత్వ రంగ బ్యాంకు అని, రోజువారీ కూలీ లు, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు సహా లక్షలాది మంది సాధారణ ప్రజలకు సేవలందిస్తుందని అన్నారు. వారి ఆర్థిక భద్రతను, వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించడం ప్రాథమిక బాధ్యతని అన్నారు. డేటా లీకేజీతో ప్రభావితమైన వినియోగదారులకు సకాలంలో సహాయం అందేలా, వారి ఖాతాలు సురక్షితంగా ఉండేలా, లీకైన సమాచారాన్ని వినియోగించే జరిగే మోసాలు లేదా అనధికార లావాదేవీలను సమర్థవంతంగా నిరోధించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటన దేశంలో డేటా రక్షణ చట్టాల అమలుపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు. సమగ్ర విచారణ ద్వారా డేటా ఉల్లంఘన ఏ స్థాయిలో జరిగిందో తేల్చాలని, బాధ్యులను గుర్తించాలని అన్నారు. లీక్ అయిన సమాచారాన్ని ఎవరైనా దుర్వినియోగం చేశారేమో నిర్ధారించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత సమాచారం బహిర్గత మోసాలు జరిగే అవకాశం ఉన్నందున, అధికారులు వినియోగదారులకు తగిన సూచనలు జారీ చేయాలని, అలాగే పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)