ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచు, వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామ పంచాయతీలకు ఈనెల 26వతేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు గుర్తులను కేటాయించారన్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అనంతపురం రూరల్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి హరితకు క్యారెట్, రుద్రంపేట గ్రామ పంచాయతీ సర్పంచు అభ్యర్థి హరిప్రసాద్‌కు బుట్ట, రాజీవ్ కాలనీ పంచాయతీ సర్పంచు అభ్యర్థి అవుకు హరికి మంచం గుర్తులను కేటాయించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అత్యంత చురుగ్గా ప్రచార పర్వంలో పాల్గొనాలని సూచించారు. మూడు పంచాయతీలలోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకోవాలన్నారు. ఇందుకోసం స్థానిక నేతలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ వెళ్లి అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై ఓటర్లకు స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ఆయా పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకతను ఓటర్లకు తెలియజేయాలని కోరారు.
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్








కామెంట్‌లు (0)