ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి
ప్రజాశక్తి - అనంతపురం : వైద్య వృత్తిలోకి రావడం ఎంతో అదృష్టమని, క్రమశిక్షణ, నిబద్ధత, విలువలతో కూడిన వైద్య విద్యను అభ్యసించి ఉత్తమ వైద్యులుగా పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం.విజయశ్రీ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ మల్లేశ్వరి సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం సెంట్రల్ హాలులో నిర్వహించారు. ‘ఎంబీబీఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం’గా జరిగిన ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వైద్యులను దేవుని తర్వాత దేవునిగా ప్రజలు భావిస్తారని, అలాంటి పవిత్రమైన వృత్తిలోకి అడుగుపెట్టిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. తల్లిదండ్రుల కలలను, తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరారు. ప్రతిష్టాత్మకమైన అనంతపురం వైద్య కళాశాలలో ప్రవేశం పొందడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణతో, నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో వైద్య విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని, వారి మార్గదర్శకత్వంలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ బెనెడిక్ట కోయిల కూడా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ కోఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ షారూన్ సోనియా, ఫౌండేషన్ కోర్సు కోఆర్డినేటర్ ఆచార్య డాక్టర్ పద్మశ్రావణి నేతృత్వంలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కళాశాలలో పాటించాల్సిన క్రమశిక్షణ, తరగతుల నిర్వహణ, బోధనా పద్ధతులు, ప్రయోగాత్మక పరీక్షలు, క్లినికల్ శిక్షణ తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైద్య కళాశాల, ఆసుపత్రిలోని వివిధ విభాగాల ప్రధాన విభాగాధిపతులు, సిబ్బందిని నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పరిచయం చేశారు. ఫార్మకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆచార్య డాక్టర్ పద్మశ్రావణి ఫౌండేషన్ కోర్సు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంషాద్ బేగం, డాక్టర్ శంకర్, డాక్టర్ తెలుగు మధుసూదన్, హాస్టల్ వార్డెన్లు డాక్టర్ మీనిగ శైలజ, డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)