టవర్ లొకేషన్‌లపై ప్రత్యేక నిఘా.. కేవీపల్లెలో చోరీ బైక్ కోణంలోనూ దర్యాప్తు
ప్రజాశక్తి–మదనపల్లె టౌన్ (అన్నమయ్య) : మదనపల్లెలో సంచలనం సృష్టించిన ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లా పోలీసుల ప్రత్యేక బృందాలు సోమవారం పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టి, నిందితుల జాడ కోసం సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా చోరీ జరిగిన రోజు నిందితులు మదనపల్లె నుంచి వాల్మీకిపురం, అక్కడి నుంచి నిమ్మనపల్లె మార్గంలో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారు వినియోగించిన బొలెరో వాహనం పీలేరు మండలం రేగళ్లు వరకు వెళ్లిన ఆనవాళ్లు లభించినప్పటికీ, అక్కడి నుంచి వాహనం జాడ కనిపించకపోవడంతో దర్యాప్తు మరింత ఉత్కంఠగా మారింది. నిందితుల కదలికలను గుర్తించేందుకు పోలీసులు మొబైల్ టవర్ లొకేషన్‌లు, సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే కేవీపల్లె మండలంలో ఇటీవల చోరీకి గురైన ఓ ద్విచక్ర వాహనం ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఏటీఎం చోరీకి పాల్పడిన ముఠాను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతోంది.







కామెంట్‌లు (0)