ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పీలేరు నియోజకవర్గం పరిధిలోని కె.వి.పల్లి మండలం, పీలేరు-కలకడ మార్గంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, పలువురు స్వల్ప గాయాల పాలయ్యారు. కె.వి పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... పీలేరు - కడప జాతీయ రహదారిలోని ఈతమాను వడ్డిపల్లి సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదం ధాటికి లారీ వెనుక బంపర్, తుఫాన్ వాహనం బంపర్‌లు ఒకదానిలో మరొకటి ఇరుక్కుపోవడంతో తుఫాన్ వాహనాన్ని సుమారు 400 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లినట్లు సమాచారం. తుఫాన్ వాహనంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తుండగా, వారిలో కె. చిన్న భాస్కర్‌రెడ్డి (63) అనే వృద్ధుడు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. వీరు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా అప్పంపల్లి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కె.వి.పల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులపై విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కె.వి.పల్లి ఎస్‌ఐ వెంకట శివకుమార్ తెలిపారు.
లారీని ఢీకొన్న తుఫాన్ వాహనం.. వృద్ధుడు మృతి
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 02:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)