- శాసనసభలో ఎమ్మెల్యే కొండయ్య
ప్రజాశక్తి - చీరాల : చీరాల నియోజకవర్గంలోని వాడరేవు ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించి తీర ప్రాంత మత్స్యకారులను ఆదుకోవాలని శాసనసభలో గురువారం చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య కోరారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రూ.450 కోట్లతో ప్రారంభమై వాడరేవు ప్రాంతంలో దాదాపు 19 వేలకు పైగా మత్స్యకారులు ఉన్నారని, ప్రతిరోజు 2 వేలకు పైగా మరబోట్లపై వేటకు వెళ్తుంటారని ఎమ్మెల్యే వివరించారు. తుపాన్లు, విపత్తులు సంభవించిన సమయంలో పడవలను సురక్షిత ప్రాంతాలకు తెచ్చుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారుతోందన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం రూ.450 కోట్ల అంచనా వ్యయంతో ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదించినా ముందుకు సాగలేదని పేర్కొన్నారు.
ఎన్డీయే ప్రభుత్వంపై మత్స్యకారుల ఆశలు
గతంలో రూ.417.55 కోట్లతో శంకుస్థాపన చేసినప్పటికీ కేంద్ర పథకం పిఎంఎంఎస్‌వై కింద నిధులు లేవని నిలిపివేశారన్నారు.మరల ఆ తర్వాత రూ.150 కోట్లతో మినీ హార్బర్ ప్రతిపాదన సైతం కార్యరూపం దాల్చలేదని చెప్పారు.రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మత్స్యకారులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ఏపీ మారిటైమ్ బోర్డు నుంచి స్పష్టమైన ప్రతిపాదనలు డీపీఆర్ తెప్పించి హార్బర్ పనులను త్వరితగతిన చేపట్టాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)