జాతీయస్థాయిలో 370 ర్యాంకు సాధించిన డాక్టర్ అరవింద్
ప్రజాశక్తి - మార్టూరు (బాపట్ల) : సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, పట్టుదలతో చదువుతూ వైద్య విద్యను అభ్యసించిన రాజుపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ కొత్తగొర్ల అరవింద్ జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడు. ఎయిమ్స్ సహా దేశంలోని ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ లో 370వ ర్యాంకు సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన కొత్తగొర్ల శివనాగేంద్ర సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. ఆయన కుమారుడు అరవింద్ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యలో మంచి ప్రతిభ చూపడంతో పాటు, నీట్ ప్రవేశ పరీక్షలో 1600వ ర్యాంకు సాధించి ఏలూరు అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. వైద్య విద్యతోనే ఆగిపోకుండా, న్యూరో సర్జన్‌గా ఎదగాలనే లక్ష్యంతో పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యాడు. క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదలతో జాతీయస్థాయిలో 370వ ర్యాంకు సాధించి తన లక్ష్యసాధనలో మరో కీలక ముందడుగు వేశాడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, ఉన్నత వైద్య విద్యలో జాతీయస్థాయి గుర్తింపు పొందడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. అరవింద్ సాధించిన విజయంపై ఆయన తండ్రి శివ నాగేంద్ర, సోదరుడు కొత్తగొర్ల కృష్ణ చైతన్యతో పాటు రాజుపాలెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కృషి, పట్టుదలతో జాతీయస్థాయి విజయాలు సాధించగలరనేందుకు డాక్టర్ అరవింద్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.







కామెంట్లు (0)