ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలి

1 గంట క్రితం

bapatla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 04:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

భూ సేకరణకు గజిట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి

రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన రైతులు

పర్చూరు ప్రాంత రైతు రంగానికి తాగునీరు సాగునీరు అందించండి.

ప్రజాశక్తి - పర్చూరు : నల్లమడ ప్రాంత రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందించడానికి నిర్మాణం తలపెట్టిన గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ ఆప్రాంత రైతులు ఆదివారం నుండి దీక్షలు ప్రారంభించారు. బొమ్మల సెంటర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ .. గుంటూరు ఛానల్ పొడుగు పొడిగింపుకు సంబంధించి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో భూసేకరణ కొరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి భూ సేకరణ చేపట్టారని, ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభించారని చెప్పారు. అదేవిధంగా పర్చూరు ప్రాంతానికి ఎంతో అవసరమైన ఈ ప్రాజెక్టు పొడిగించాలని రైతులు, ప్రజలు దశాబ్దాల కాలంగా వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత రైతుల ప్రజల కల సాకారం చేసే విధంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి బాపట్ల జిల్లాలో కూడా భూసేకరణ కొరకు గెజిట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పర్చూరు మండలంలోని ఇనగల్లు, ఏదుబాడు గ్రామాల వరకే ప్రాజెక్టు పరిమితం కాకుండా పర్చూరు వరకు గుంటూరు ఛానల్ ను పొడిగించాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ పొడిగించే వరకు రైతుల నిరసనలు దీక్షలు కొనసాగుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక్కడ రైతులు ప్రజలు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు పనులు పర్చూరు వరకు కాకుండా మధ్యలో ఆపేయడం ఎంతవరకు న్యాయమని రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించడానికి ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసే విధంగా చూడాలని వారు కోరారు. తొలి రోజు నిర్వహించిన ఈ రిలే నిరాహార దీక్షలో నల్లమడ రైతు సంఘం నాయకుడు కొల్లా రాజమోహనరావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, ఒగ్గిశెట్టి గీవిందరాజులు, కుక్కపల్లి బుచ్చిబాబు, దేవరపు లక్ష్మీనారాయణ, తాళ్ళూరి వెంకటసుబ్బారావు, నాయుడు సుబ్బారావు లు పాల్గొన్నారు. పర్చూరు మండలంలోని ప్రజలు రిలే దీక్షలకు తమ సంఘీభావం తెలిపారు. 17వ తేదీ సోమవారం, తిమ్మరాజుపాలెం , శ్యామలా వారి పాలెం , గర్నెపూడి గ్రామ రైతులు నిరసన దీక్షలో పాల్గొననున్నారని నల్లమడ రైతు సంఘం నాయకులు తెలిపారు . ఈ రిలే దీక్షలో ప్రజలు రైతులు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్