ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : ఉదయాన్నే వాకింగ్‌కు బయలుదేరిన పర్చూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది రావి సత్యనారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఈరోజు ఉదయం పర్చూరు మార్కెట్ యార్డు నుంచి వాకింగ్‌కు వెళుతున్న న్యాయవాదిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన తలకు, శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించేందుకు బంధువులు స్థానికులు ప్రయత్నించారు. గాయాల తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ప్రమాదానికి కారణమైన వాహనం ఎవరిది ?
ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వాహనం ఆచూకీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనాన్ని గుర్తించే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై పులి గోపి తెలిపారు. పర్చూరులో ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు ఉన్న రావి సత్యనారాయణ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న పలువురు న్యాయవాదులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతున్నట్లు తెలిసింది.








కామెంట్‌లు (0)