ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొద్ది రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

5 రోజుల క్రితం

Wedding just days away then tragedy strikes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి.. పెళ్లి ఇంట్లో తీరని విషాదం


ప్రజాశక్తి – మార్టూరు (బాపట్ల) : మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. వివాహానికి సిద్ధమవుతున్న యువకుడు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి పనుల్లో నిమగ్నమైన కుటుంబంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటన బంధువులు, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ... మార్టూరు సమీపంలోని ఆదిజాంబవ కాలనీలో నివాసం ఉంటున్న పెద్దకర్ణి యశ్వంత్ (22) కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. పెళ్లి నేపథ్యంలో ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంటి పై అంతస్తు నుంచి మెట్ల మీదుగా కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అదుపుతప్పి మెట్లపై నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే యశ్వంత్‌ను మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


తల్లిని కోల్పోయిన కుటుంబానికి మరో దెబ్బ ...

యశ్వంత్ తల్లి గతంలోనే మృతి చెందడంతో సోదరి దగ్గరుండి అతడి వివాహ ఏర్పాట్లు చూసుకుంటోంది. మరికొద్ది రోజుల్లో సోదరుడి పెళ్లి జరగనుందన్న ఆనందంలో ఉన్న కుటుంబానికి ఈ ఘటన తీరని శోకాన్ని మిగిల్చింది. కళ్లముందే పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా, సోదరుడు విగతజీవిగా మారడంతో ఆ సోదరి రోదనలు బంధువులను కలచివేశాయి. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు అకాల మరణం చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మార్టూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ యార్లగడ్డ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్