ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష
ప్రజాశక్తి – చిత్తూరు: ప్రతి పోలింగ్ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. మంగళవారం జడ్పీ కార్యాలయంలోని జడ్పీ సీఈవో ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని చిత్తూరు, కుప్పం, నగరి, పలమనేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలపై చర్చించారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన గదులు, స్థలాలను ఆర్డీవోలు, రిటర్నింగ్ అధికారులు ముందుగానే గుర్తించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర సీసీ కెమెరాల నిఘా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 24 గంటల భద్రత కల్పించాలి. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. అవసరమైన సాంకేతిక సదుపాయాలను ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బారికేడ్లు నిర్మించాలని ఆదేశించారు. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, సీటమ్స్ ఇంజనీరింగ్ కళాశాల, కుప్పంలోని ప్రభుత్వ ఒకేషనల్ కళాశాల, నగరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలమనేరులోని ఎస్వీసీఆర్ కళాశాల, టీకేసీ జూనియర్ కళాశాలల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదలైందని, ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్వో కే. మోహన్ కుమార్, జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఆర్డీవోలు శ్రీనివాసుల నాయుడు, అనుపమ, షేక్ మొహమ్మద్ హుస్సేన్, ఆర్అండ్బీ ఇంజనీర్ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ నవీన్ కుమార్, డీడబ్ల్యూఎంఏ పీడీ రవికుమార్, ఏపీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)